‘ధాన్యం’పై విజిలెన్స్‌ విచారణ | - | Sakshi
Sakshi News home page

‘ధాన్యం’పై విజిలెన్స్‌ విచారణ

Dec 6 2025 7:29 AM | Updated on Dec 6 2025 7:29 AM

‘ధాన్యం’పై విజిలెన్స్‌ విచారణ

‘ధాన్యం’పై విజిలెన్స్‌ విచారణ

● మిల్లుల్లో పరిశీలించిన ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు ● కిష్టాపూర్‌, దుగ్నేపల్లి కేంద్రాల్లో అక్రమాల్లేవని నిర్ధారణ

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఫిర్యాదుపై పౌరసరఫరాల శాఖ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు శుక్రవారం మరోసారి విచారణ చేశారు. చెన్నూర్‌ మండలం కిష్టాపూర్‌, దుగ్నేపల్లి కొనుగోలు కేంద్రాల పరిధిలో విస్తీర్ణం కంటే అధికంగా ధాన్యం దిగుబడి, దొడ్డు రకం ధాన్యం సన్న రకంగా చూపించి సర్కారు ఇచ్చే బోనస్‌ పొందే ప్రయత్నం చేశారంటూ ఫిర్యాదులు అందడం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై ఎన్‌ఫోర్స్‌మెంటు ఓఎస్డీ శ్రీధర్‌రెడ్డి, ఏఎస్‌వో సుదర్శన్‌రెడ్డి, కార్పొరేషన్‌ అధికారులు రజిత కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో కలిసి విచారణ చేపట్టారు. కిష్టాపూర్‌ పరిధిలో ధాన్యం సేకరణ జరిగిన నాలుగు మిల్లుల్లో విచారణలో భాగంగా తాజాగా మరో రెండు మిల్లుల్లో తనిఖీ చేశారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం, మిల్లుల్లో ఉన్న నిల్వలతో సరిపోల్చుకున్నారు. గతంలో ఇచ్చిన నివేదికతోపాటు మరోమారు దర్యాప్తు చేయగా ఈ కేంద్రాల్లో తప్పిదాలేవీ జరగనట్లుగా ప్రాథమికంగా నిర్ధారించుకున్నట్లు అధికారులు తెలిపారు. విస్తీర్ణం కంటే అధికంగా ధాన్యం దిగుబడి చూపించి లబ్ధి పొందారనే ఫిర్యాదులోనూ వాస్తవం లేనట్లుగా గుర్తించారు. చుట్టుపక్కల గ్రామాల పరిధిలో ధాన్యం దిగుబడితో పోలిస్తే కిష్టాపూర్‌, దుగ్నేపల్లి కేంద్రాల్లో ఫిర్యాదు వచ్చినట్లు ఎలాంటి అక్రమాలు జరగలేదని అధికారులు అంచనాకు వస్తున్నారు. గతంలో వచ్చిన ఫిర్యాదుపై ఇప్పటికే దుగ్నేపల్లి కేంద్రం పరిధిలో విచారణ జరిపారు. గత రబీ సీజన్‌లో రైతులు ఇచ్చిన ధాన్యమే మిల్లులో ఉన్నట్లుగా గుర్తించారు. అలాగే అప్పటి వ్యవసాయాధికారులు ధాన్యం నిబంధనల ప్రకారమే ఆయా రకాన్ని(గ్రేడ్‌) ఆమోదించినట్లు ప్రాథమికంగా గుర్తించారు.

పీడీఎస్‌ బియ్యం పట్టివేత

జిల్లా కేంద్రం ఎన్టీఆర్‌ నగర్‌లో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 15.30క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిల్వతోపాటు ఆటోలో తరలిస్తున్న బియ్యాన్ని పంచనామా చేసి, కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement