చేపా.. చేపా.. లక్ష్యం చేరలేదు..!
మంచిర్యాలఅగ్రికల్చర్: అసలే ఆలస్యం.. సరఫరా చేసిందీ సగం. అందులోనూ నాణ్యతాలోపం.. ఏదో వదిలామా.. లేదా..? అన్న చందంగా చేపపిల్లల పంపిణీ సాగుతోంది. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలు సరఫరా చేస్తోంది. ఈ ఏడాది జిల్లాలో 369 చెరువులు, కుంటలు, 11 ప్రాజెక్టుల్లో 2.23 కోట్ల చేపపిల్లల విడుదలకు లక్ష్యం పెట్టుకున్నారు. జూలై, ఆగస్టు నెలల్లో భారీ వర్షాలకు చెరువులు, కుంటలు మత్తడి దూకా యి. ప్రాజెక్టుల గేట్లు ఎత్తి లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో జలాశయాల్లో ఇప్పటివరకు 1.24 కోట్ల చేపపిల్లలు మాత్రమే వదిలారు. పూర్తి స్థాయిలో వదలకపోవడంపై మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో చేపపిల్లలు వదిలేందుకు సీజన్ కాగా.. సరఫరాకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో టెండర్లు వాయిదా పడుతూ వచ్చాయి. దీంతో పలు మండలాల్లో మత్స్యకారులే చేపపిల్లలు కొనుగోలు చేసి జలాశయాల్లో వదిలారు. ఆలస్యంగా ఇద్దరు టెండరుదారులు చేపపిల్లల సరఫరాకు ముందుకు రావడంతో నవంబర్ 4 నుంచి పంపిణీ చేపట్టారు. నెల రోజులు గడుస్తున్నా 56శాతమే సరఫరా చేశారు. ఇప్పటికే సరఫరా సీజన్ ముగిసింది. సీజన్‌లో చేపపిల్లలు వదిలితే ఆరు నెలల కాలంలో మూడు నుంచి నాలుగు కిలోల వరకు చేప ఎదిగి మత్స్యకారులకు లాభదాయకంగా ఉండేది. యాసంగి పంటల సాగుకు నీరు వదిలితే చేపల ఎదుగుదలపై ప్రభావం పడనుంది.
నాణ్యత అంతంతే..
జిల్లాలో 35 నుంచి 40 మిల్లీమీటర్ల పరిమాణం గల చేపపిల్లలు(కట్ల, రవు) 115.65 లక్షలు, 80 నుంచి 100 మిల్లీమీటర్ల పరిమాణం గలవి(కట్ల, రవు, మ్రి గాల) 108.28 లక్షలు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకు 35 నుంచి 40మిల్లీమీటర్ల పరి మాణం గల 1.12లక్షల చేపపిల్లలు, 80నుంచి 10 మిల్లీమీటర్ల పరిమాణం గలవి 13లక్షల చేపపిల్లలు వదిలారు. ఇందులో చిన్నపిల్లలు 30మిల్లీమీటర్ల లో పు ఉన్నాయని, 10నుంచి 20శాతం చనిపోయి ఉంటున్నాయని మత్స్యకారులు వాపోతున్నారు. మందమర్రి మండలానికి డీసీఎం వాహనం ట్యాంకుల్లో తీసుకొచ్చిన చేపపిల్లలు చనిపోయి ఉండడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అధికారులు తిరిగి పంపించారు. లక్సెట్టిపేట మండలం వెంకట్రావుపేట్‌కు చెందిన మత్స్యకారులు సైతం నాణ్యతలేవని చేపపిల్లలను తిరస్కరించారు.
గతేడాది 20శాతమే..
గతేడాది 2.22 కోట్ల చేపపిల్లలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. కానీ ఇందులో 20శాతం కూడా సరఫరా చేయలేదు. ఈ ఏడాది 2.23 కోట్లు పంపిణీ లక్ష్యం కాగా ఇప్పటి వరకు 56శాతమే సరఫరా చేశారు. లక్ష్యం మేరకు సరఫరా చేయకపోవడంపై మత్స్యకారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో చేపపిల్లలు, రొయ్యల పంపిణీ పంపిణీ చేపట్టింది. ప్రస్తుతం రొయ్యల సీడ్‌కు మంజూరు కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు.
నీటి నిల్వలు లేకపోవడం వల్లనే..
జిల్లాలో 380 చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు 1.25 కోట్లు చేపపిల్లలు పంపిణీ చేశాం. 56శాతం సరఫరా పూర్తయింది. నాణ్యత లేని, చనిపోయి ఉన్నపిల్లలను వెనక్కి పంపి మళ్లీ సరఫరా చేయడం జరిగింది. ప్రస్తుతం కాంట్రాక్టర్ గత నాలుగు రోజులగా సరఫరా నిలిపివేశాడు. ఈ ఏడాది సుందిళ్ల, అన్నారం, గోదావరిబ్యాక్ వాటర్ నీటినిల్వలు లేక పెద్ద చేపపిల్లలను విడదల చేయడం లేదు.
– ఆర్.అవినాష్, జిల్లా మత్స్యశాఖ అధికారి


