‘వసతి’లో బస అంతేనా?
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ గురుకులాలు, వసతిగృహాల్లో పర్యవేక్షణ లోపిస్తోంది. విద్యార్థుల సంక్షేమం నుంచి భోజనం మెనూ వరకు ఇష్టారాజ్యంగా మారింది. అధ్వాన భోజనం వడ్డింపుపై విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేసినా.. అధికారుల తనిఖీల్లో వాస్తవమని తేలినా.. సంబంధిత వ్యక్తులపై చర్యలు కరువయ్యాయి. వసతిగృహాల్లో విద్యార్థులకు అందుతున్న ఆహారం, ఇతర సదుపాయాలు, సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు నెలలో ఒకరోజు బస చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ విద్యాసంవత్సరంలో రాత్రి బస కార్యక్రమం నిర్వహించలేదు. జిల్లాలో 10 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలు, డిగ్రీ కళాశాలలున్నాయి. ఎనిమిది ఎంజేపీటీబీసీలు, 16 ఎస్టీ ఆశ్రమ, రెండు పోస్టు మెట్రిక్ వసతిగృహాల్లో 3,249 మంది, 18 వసతిగృహాల్లో 1,645 మంది విద్యార్థులున్నారు. ఎస్సీ వసతిగృహాల్లో 2,067 మంది ఉన్నారు. వీరి బాగోగులను సంక్షేమశాఖ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న వసతిగృహాలు మినహాయిస్తే దూర ప్రాంతాలకు వెళ్లిన సందర్భాలు తక్కువే. ఇటీవల హాస్టల్‌లో వార్డెన్ లేకపోవడంపై అధికారి తీసుకున్న చర్యలు నామమాత్రమే. కొన్నిచోట్ల వార్డెన్లు పెట్టిందే మెనూగా మారింది. భవనాలు శిథిలావస్థకు చేరడం, ఇతర త్రా సమస్యలు నెలకొన్నాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా స్నానపు గదులు లేకపోవడంతో ఆ రుబయటే స్నానం చేయాల్సిన దుస్థితి ఉంది. గురుకులాలు, వసతిగృహాల్లో రాత్రి బస చేస్తే విద్యార్థుల సమస్యలు పరిష్కారమయ్యే అవకాశముంది.
సరుకుల సరఫరాలో గోల్‌మాల్
గురుకులాలు, వసతిగృహాలకు సరఫరా చేసే సరుకుల్లో గోల్‌మాల్ జరుగుతోంది. కాంట్రాక్టర్లు బ్రాండెడ్ సరుకులు సరఫరా చేస్తున్నామని చెబుతున్నా నాన్‌బ్రాడెండ్ సరుకులే కనిపిస్తున్నాయి. కచ్చితమైన తేదీలు లేకపోవడంతో వీలున్నప్పుడు సరుకుల సరఫరాతో కాంట్రాక్టర్, వార్డెన్లకు కలిసివస్తోంది. నిబంధనల ప్రకారం విజయ పాలు సరఫరా చేయాల్సిన ఉన్నా చాలాచోట్ల టెట్రా, ఇతర సంస్థలకు చెందిన పాలు వినియోగిస్తున్నారు. టెండర్ ప్రకారం కాంట్రాక్టర్ సరుకులు, చికెన్, పాలు, కూరగాయలు సరఫరా చేయకపోతే బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాల్సి ఉన్నా అధికారులు తాత్సారం చేస్తున్నారు. సరుకుల గోల్‌మాల్‌పై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరముంది.


