ఏసీబీకి పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి
భీమిని: ఇందిరమ్మ ఇంటి బిల్లు కోసం ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ కన్నెపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ సంఘటన బెల్లంపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. మండల కేంద్రమైన కన్నెపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి గొల్లపల్లి రాజ్‌కుమార్ ఇందిరమ్మ ఇంటి బిల్లు కోసం ఓ లబ్ధిదారుడి నుంచి రూ.10వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు అంత డబ్బు తనతో కాదని రూ.5వేలు ఇవ్వడానికి అంగీకరించాడు. అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులను సంప్రదించాడు. శుక్రవారం సాయంత్రం కన్నెపల్లిలో విధులు ముగించుకుని.. బెల్లంపల్లి పట్టణంలో కాంటా వద్దకు వచ్చిన బాధితుడి నుంచి రూ.5వేలు రాజ్‌కుమార్ తీసుకుంటుండగా ఆదిలాబాద్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ మధు సిబ్బందితో కలిసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ మధు మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శిపై కేసు నమోదు చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. ఏ ప్రభుత్వ అధికారి అయినా లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064, మొబైల్ నంబర్ 9154388963ను సంప్రదించాలని సూచించారు.


