ఆభరణాల చోరీ కేసులో అల్లుడే నిందితుడు
కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని ద్వారకానగర్‌కు చెందిన వీరమ్మ బంగారు ఆభరణాలు చోరీ చేసిన కేసులో ప్రధాన నిందితుడు ఆమె అల్లుడేనని డీఎస్పీ వహీదుద్దీన్ తెలిపారు. బుధవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. వీరమ్మ ఇంట్లో గత నెల 28న గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధిత మహిళ కుమారుడు తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టామన్నారు. వీరమ్మకు స్వయానా అల్లుడైన బెల్లంపల్లి హనుమాన్ బస్తీలో నివాస ముంటున్న వేముల బాలకృష్ణ అత్తగారి ఆస్తిపై కన్నేశాడు. రెబ్బెన మండలంలోని నార్లాపూర్‌కు చెందిన బండి నీలేష్, తాండూరు మండలంలోని కత్తెర్లకు చెందిన దూల రాజ్‌కుమార్‌ను వీరమ్మ ఇంట్లోకి పంపించాడు. సదరు వ్యక్తులు ఆమెను కిందపడేసి మెడలో ఉన్న గొలుసులాక్కున్నారు. బీరువాలో ఉన్న మరో గొలుసు, 5 ఉంగరాలతో పాటు రూ.10 వేల నగదు ఎత్తుకెళ్లారు. వాటిని బాలకృష్ణకు అప్పగించాడు. అతను అందులో ఒక గొలుసు అమ్మి ఇవ్వాలని తాండూరు మండలం చౌటపల్లికి చెందిన తోగుల తిరుపతికి ఇచ్చాడు. తిరుపతి ఆ గొలుసును బెల్లంపల్లి మార్కెట్‌లోని శంకరాచారి అనే స్వర్ణకారుడికి అమ్మి రూ.1,06,500 తీసుకున్నాడు. సీసీ పుటేజీల ఆధారంగా బాలకృష్ణ, నీలేష్, తిరుపతిని అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి నగలు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. రాజ్ కుమార్ పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామన్నారు. సమావేశంలో పట్టణ సీఐ ప్రేం కుమార్, ఎస్సై సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.


