సీఎం సారూ.. మీపైనే ఆశలు
ఉమ్మడి జిల్లాలో పేరుకుపోయిన సమస్యలు
నేడు ఆదిలాబాద్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో బహిరంగసభ
కై లాస్‌నగర్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి బుధవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజాపాలన విజయోత్సవ సంబరాల్లో భాగంగా పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించనున్న బహిరంగ సభకు హాజరుకానున్నారు. అక్కడి నుంచే పలు అభివృద్ధి పనులకు సంబంధించి శిలాఫలకాలు ఆవిష్కరించనున్నారు. ఇక ఉమ్మడి జిల్లాలో సుదీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని సమస్యలు అనేకం ఉన్నాయి. విద్య, వైద్య, మౌలిక వసతుల పరంగా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. రైతులు, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతవాసులు సీఎం కల్పించే భరోసాపై గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. అధికారంలోకి వస్తే ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని ప్రకటించిన సీఎం ఆ దిశగా ఏమైనా కార్యాచరణ ప్రకటిస్తారా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
పర్యటన సాగుతుందిలా...
సీఎం మధ్యాహ్నం 1.20 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో బయలుదేరి 2గంటలకు ఆదిలాబాద్‌లోని ఎరోడ్రమ్‌కు చేరుకుంటారు. 2.10 గంటలకు కాన్వాయ్ ద్వారా ఇందిరా ప్రియదర్శిని స్టేడియంకు చేరుకుంటారు. పలు అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 3.45గంటలకు స్టేడియం నుంచి హెలిప్యాడ్‌కు చేరుకుని హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు.


