నామినేషన్ల పరిశీలన పకడ్బందీగా చేపట్టాలి
బెల్లంపల్లిరూరల్/భీమిని: గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ పత్రాల పరిశీలన ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం ఆయన బెల్లంపల్లి మండలం బుధాకుర్థు, కన్నెపల్లి మండలం జన్కాపూర్ గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల పక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి క్షుణ్ణంగా పరిశీలించాలని, రిజిష్టర్లను సక్రమంగా నిర్వహించాలని అన్నారు. ఎన్నికల గుర్తుల కేటాయింపులో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, ఎంపీడీవోలు మహేందర్, శ్రీనివాస్‌రెడ్డి, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.
పీహెచ్‌సీ భవన నిర్మాణం పరిశీలన
కన్నెపల్లి మండల కేంద్రంలో పీహెచ్‌సీ భవన నిర్మాణ పనులను కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచించారు. తహసీల్దార్ రాంచందర్, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
పోలింగ్ రోజు సెలవు
మంచిర్యాలఅగ్రికల్చర్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ రోజు ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక, ప్రభుత్వ సంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోసం ఉపయోగించే ప్రజాభవనాలు, విద్యాసంస్థలు, ఇతర భవనాలకు పోలింగ్ రోజు ప్రభుత్వ సెలవు, పోలింగ్‌కు ముందు రోజు స్థానిక సెలవుగా పరిగణించాలని పేర్కొన్నారు. దండేపల్లి, హాజీపూర్, జన్నారం, లక్సెట్టిపేట మండలాల్లో 10, 11న, బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి, కాసిపేట, నెన్నెల, తాండూర్, వేమనపల్లి మండలాల్లో 13, 14న, భీమారం, జైపూర్, చెన్నూర్, కోటపల్లి, మందమర్రి మండలాల్లో 16, 17న సెలవుదినంగా ప్రకటించినట్లు తెలిపారు.


