రోడ్డు విస్తరణ సర్వే అడ్డుకున్న వ్యాపారులు
చెన్నూర్: చెన్నూర్ మున్సిపాల్టీలో రోడ్ల విస్తరణ సర్వేను ఆర్‌ఎంబీ అధికారులు బుధవారం ప్రారంభించారు. అంబేడ్కర్ చౌరస్తా నుంచి పెద్ద చెరువు రావిచెట్టు వరకు, తెలంగాణ తల్లి విగ్రహం నుంచి కత్తెరశాల ఎక్స్‌రోడ్డు వరకు, గాంధీచౌక్ నుంచి గోదావరి రోడ్డు వరకు విస్తరణ కోసం సర్వే చేపట్టారు. అంబేడ్కర్ చౌక్ నుంచి రావిచెట్టు వరకు సర్వేయర్లు కొలతలు తీశారు. అపోలో మెడికల్ వద్ద వ్యాపారులు సర్వేను అడ్డుకున్నారు. దీంతో మున్సిపల్ సర్వేయర్లు, సిబ్బంది వెనుదిరిగారు. చెన్నూర్ వర్తక వ్యాపార సంఘం అధ్యక్షుడు పడమటింటి సతీశ్ మాట్లాడతూ విస్తరణకు తాము అడ్డంకి కాదని, వ్యాపారులకు నోటీసులు ఇవ్వకుండా కొలతలు చేపట్టడమేమిటని ప్రశ్నించారు. ముందుగా బైపాస్ రోడ్డు అభివృద్ధి చేసి భారీ వాహనాలు అటుగా మళ్లించాలని, పట్టణంలో కుక్కలు, కోతలు బెడద నివారించాలని అన్నారు. కాగా, మున్సిపల్ కమిషనర్ మురళికృష్ణ స్పందిస్తూ సర్వే మాత్రమే నడుస్తోందని, 66 ఫీట్ల రోడ్డు వెడల్పు చేయాల్సి ఉందని తెలిపారు. ఈ కొలతల కంటే ఎక్కువ నష్టం జరిగితే పరిహారం కింద భవన నిర్మాణ అనుమతిలో రాయితీ కల్పిస్తామని, ప్రజలు సహకరించాలని అన్నారు.


