నేడు నామినేషన్ల ఉపసంహరణ
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బుధవారం నామి నేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నిర్వహిస్తారు. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు గాను డమ్మీ అభ్యర్థులుగానే కాకుండా రెబల్‌గా నామినేషన్ వేసినవారికి పంచాయతీ ఎన్నికలు వరంగా మారాయి. తమకు అధికసంఖ్యలో ఓటర్ల మద్దతు ఉందని ప్రచారం చేసుకుంటూ గుర్తింపు చాటుకుంటున్నారు. మంచి ర్యాల రెవెన్యూ డివిజన్‌లోని హాజీపూర్, దండేపల్లి, లక్సెట్టిపేట, జన్నారం మండలాల్లో 90 గ్రామపంచాయతీల్లో తొలి విడత ఎన్నికలు జరుగుతున్నా యి. 90 పంచాయతీల్లో మూడు గ్రామాలకు నామి నేషన్లు దాఖలు కాలేదు. మిగతా 87 పంచాయతీల్లో ఎన్నికలు జరగనుండగా 408 మంది నామినేషన్లు వేశారు. 816 వార్డు సభ్యుల స్థానాలకు గాను 34 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. మిగతా 782 వార్డు స్థానాలకు గాను 1,697 నామినేషన్లు వేశారు. పోటీలో ఉన్న నాయకులు ఉపసంహరణ చేసుకోవా లని కోరినప్పుడు డమ్మీలు మొదట ససే మిరా అంటూనే ఆపై తమ మనసులోని కోరిక నేరుగా చెప్పేస్తున్నారు. మొదట పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తూ సాగే చర్చలో బేరసారాలు చేసుకుంటూ ఎంతో కొంత సెటిల్ చేసుకుని నామినేషన్లు ఉపసంహరించుకోవడం పరిపాటిగా మారింది. మరికొంత మంది తమతో మంతనాలు జరిపేందుకు ఎవరూ రాకుంటే వారే స్వయంగా అభ్యర్థుల వద్దకు వెళ్లి డబ్బులిస్తే పోటీ నుంచి తప్పుకొంటామని బేరసా రాలకు దిగుతున్నారు. గెలుపుపై ఆశలు పెట్టుకున్న అవతలి అభ్యర్థులు కొంత మొత్తమైనా ముట్టజెప్పకపోతారా? అని చూస్తున్నారు. ఈ తరహాలో డమ్మీ అభ్యర్థులు తొలి విడతలో ఉండగా సోమ, మంగళవారాల్లో గ్రామాల్లో ఎక్కడ చూసినా వీరిని పోటీ నుంచి తప్పుకోవాలని మంతనాలు పెద్ద ఎత్తున సాగడం కొసమెరుపు. ఇక రెబల్ అభ్యర్థుల తీరు మరోలా ఉండగా గెలుపు గుర్రాలమంటూ బెట్టు చేస్తున్నారు. ఏది ఏమైనా డమ్మీలు, ఆశావహుల వ్యూహాన్ని పసిగట్టిన కొంత మంది చేసేది లేక వారి కి ఎంతో కొంత ముట్టజెబుతూ నామినేషన్లు ఉపసంహరించుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో రూ.10వేల నుంచి రూ.50 వేలకే పై గా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొ న్ని చోట్ల ఉపసంహరణకు బెదిరింపులు, బుజ్జగింపులు, మధ్యవర్తిత్వాలతో చర్చలు జరుగుతున్నా యి. గ్రామ రాజకీయాలు వేడెక్కిన తరుణంలో ఉపసంహరణ ప్రక్రియ అనంతరం ఎవరు బరిలో ఉంటారో, ఎవరు ఉపసంహరించుకుంటారోనన్న పరిస్థితులకు నేడు తెరపడనుంది.


