వైకల్యం చిన్నబోయింది..!
క్రీడల్లో రాణిస్తున్న దివ్యాంగులు.. ఆసరాగా నిలుస్తున్న వికాసం ప్రత్యేక పాఠశాల పతకాలు కై వసం చేసుకుంటున్న విద్యార్థులు నేడు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం
ఉట్నూర్‌రూరల్: చదువులోనే కాదు క్రీడల్లో కూడా సత్తా చాటుతామని నిరూపిస్తున్నారు వికాసం పాఠశాల దివ్యాంగ విద్యార్థులు. రెండేళ్లుగా జిల్లాస్థాయి క్రీడాపోటీల్లో ఓవరాల్ చాంపియన్‌గా నిలుస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని కేబీ ప్రాంగణంలో ఏజెన్సీ ప్రాంత దివ్యాంగ బాలబాలికల కోసం 2014లో అప్పటి పీవో ఆర్వీ కర్ణన్ వికాసం పేరుతో ప్రత్యేక పాఠశాలను ప్రారంభించారు. ఇందులో వినికిడిలోపం, దృష్టిలోపం, బుద్ధిమాంద్యం, శిశుపాక్షిక పక్షవాతం గల విద్యార్థులు 152 మంది 1 నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్నారు. వీరు పరుగు పందెం, క్యారమ్, చెస్, జావెలిన్ త్రో, ఆర్చరీ పోటీల్లో రాణిస్తున్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లాస్థాయి క్రీడాపోటీల్లో ప్రతిభ చూపి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. పలు పతకాలు కై వసం చేసుకుని చాంపియన్లుగా నిలిచారు. బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వారి అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.


