రేపు ట్రాఫిక్ డైవర్షన్
● పట్టణంలోని పలురూట్లలో ఆంక్షలు
ఆదిలాబాద్‌టౌన్: ఈనెల 4న ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ డైవర్షన్ చేపడుతున్నట్లు వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. అంకోలి, తంతోలి గ్రామాల ప్రజలు కేఆర్‌కే మీదుగా పిట్టల్‌వాడ నుంచి పట్టణానికి చేరుకోవాలని పేర్కొన్నారు. ఏరోడ్రమ్ నుంచి ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వరకు రోడ్డుపై పూర్తిగా ఆంక్షలు ఉంటాయన్నారు. నిర్మల్, మావల మీదుగా సభకు వచ్చే బస్సులు పిట్టల్‌వాడ, మావల పోలీస్‌స్టేషన్ మీదుగా తెలంగాణ రెసిడెన్షియల్ బాలుర కళాశాలలో పార్కింగ్ చేసుకోవాలని సూచించారు. ఉదయం నుంచి ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని, కేఆర్‌కే కాలనీ, హ్యాండిక్యాప్ కాలనీకి ఆంక్షలు వర్తిస్తాయన్నారు. అత్యవసర పనుల కోసం ప్రజలు పట్టణంలోని అంతర్గత రోడ్లను వినియోగించుకోవాలన్నారు. వీఐపీ వాహనాలు తెలంగాణ చౌక్ మీదుగా కాన్వెంట్ స్కూల్, సరస్వతి శిశుమందిర్ నుంచి టీటీడీ కల్యాణ మండపానికి చేరుకోవాలన్నారు. సభకు వచ్చే ప్రజలు ద్విచక్ర వాహనాలను రాంలీలా మైదానం, సైన్స్ డిగ్రీ కళాశాలలో పార్కింగ్ చేయాలన్నారు. టూవీలర్లు, కార్లు, ఆటోలను కేటాయించిన స్థలాల్లోనే పార్కింగ్ చేసి నడక మార్గంలో సభా స్థలానికి చేరుకోవాలని సూచించారు.
బైక్‌తో ఢీకొట్టి.. ప్రశ్నిస్తే చితక్కొట్టి..
బోథ్: బైక్‌పై అతివేగంగా వచ్చి నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టగా ప్రశ్నించినందుకు అతనిపై దాడికి పాల్పడిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీసాయి తెలిపిన వివరాల మేరకు కోఠ కె గ్రామానికి చెందిన వి నోద్ తన ఆటోను సొనాల మండల కేంద్రంలో ఆటోస్టాండ్ వద్ద ఉంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఘన్‌పూర్ నుంచి పల్సర్ బైక్‌పై అతివేగంగా వచ్చిన జాదవ్ సాయికిరణ్, కిషన్ మహరాజ్ వినోద్‌ను ఢీకొట్టారు. వినో ద్ వారిని మందలించడంతో అతనిపై దాడి చేశారు. తీవ్రగాయాలు కావడంతో గమనించిన స్థానికులు మండల కేంద్రంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితుడి తండ్రి బర్గి నాగోరావ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట మహాత్మ జ్యోతిబా ఫూలే బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు పీఎంశ్రీ జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చారు. బెల్లంపల్లి తెలంగాణ గురుకుల పాఠశాలలో సోమవారం నిర్వహించిన స్పోర్ట్స్ మీట్‌లో ఖోఖోలో బంగారు పతకాలు సాధించారు. మంగళవారం ఉమ్మడి జిల్లా ఎంజేపీల ఆర్‌సీవో, ప్రిన్సిపాల్ సేరు శ్రీధర్, అసిస్టెంట్ ప్రిన్సిపాల్ నాగజ్యోతి, పీడీ సురేశ్, పీఈటీ నాగేశ్, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు.


