సినిమాలతో ప్రేరణ పొంది.. గన్‌ కొని | - | Sakshi
Sakshi News home page

సినిమాలతో ప్రేరణ పొంది.. గన్‌ కొని

Dec 3 2025 8:15 AM | Updated on Dec 3 2025 8:15 AM

సినిమాలతో ప్రేరణ పొంది.. గన్‌ కొని

సినిమాలతో ప్రేరణ పొంది.. గన్‌ కొని

● డబ్బు కోసం వ్యాపారిని బెదిరించిన యువకుడి అరెస్టు ● కుమురంభీం జిల్లాలో ఘటన

కౌటాల(సిర్పూర్‌): హిందీ సినిమాల ప్రభావంతో ఓ యువకుడు బిహార్‌కు వెళ్లి గన్‌ కొనుగోలు చేశాడు. ఈజీగా మనీ సంపాదించాలనే ఉద్దేశంతో స్థానిక వ్యాపారిని బెదిరించాడు. అంతేకాక సదరు వ్యాపారి తమ్ముడిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. కౌటాల సర్కిల్‌ కార్యాలయంలో మంగళవారం ఎస్పీ నితిక పంత్‌ వివరాలు వెల్లడించారు. కౌటాల మండలం సాండ్‌గాంకు చెందిన కుర్బంకర్‌ అజయ్‌ హిందీ సినిమాలు చూసి ప్రేరణ పొంది వ్యాపారులను బెదిరించి, వినకపోతే చంపి అయినా ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. జూన్‌ 12న రూ.50లక్షల నగదును మహారాష్ట్రలోని చంద్రపూర్‌ బస్టాండ్‌కు వచ్చి ఇవ్వాలని కౌటాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యాపారి ఫర్టిలైజర్‌ షాపులో బెదిరింపు లెటర్‌ వేశాడు. వ్యాపారి స్పందించకపోవడంతో యూట్యూబ్‌ వీడియోల ద్వారా ఆయుధాలు బిహారులో దొరుకుతాయని తెలుసుకుని జూలై చివరి వారంలో అక్కడికి వెళ్లాడు. బాబు సాహెబ్‌ కుమార్‌ అనే వ్యక్తికి రూ.55వేలు చెల్లించి ఒక పిస్టోల్‌, ఒక తపంచా, రెండు మ్యాగజైన్లు, 21 బుల్లెట్లు కొనుగోలు చేశాడు. మూడు బుల్లెట్లతో అక్కడే ప్రాక్టీస్‌ చేసి ఇంటికి చేరుకున్నాడు. సమీపంలో ప్రాణహిత నది ఒడ్డున కూడా ఒక బుల్లెట్‌ను గాలిలోకి ఫైర్‌ చేశాడు. మళ్లీ సెప్టెంబర్‌ 26న కాగజ్‌నగర్‌ నుంచి మహారాష్ట్ర వెళ్లే రైలులో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ నుంచి అజయ్‌ మళ్లీ వ్యాపారికి కాల్‌ చేసి బెదిరించాడు. అక్టోబర్‌ 15న రాత్రి 7 గంటల సమయంలో వ్యాపారి తమ్ముడిని చంపాలనే ఉద్దేశంతో ముఖంపై లైట్‌ ఫోకస్‌ వేసి ఫైర్‌ చేశాడు. కానీ గురితప్పింది. అక్టోబర్‌ 18న బాధితుడు కౌటాల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో మరోసారి వ్యాపారి లేదా వారి కుటుంబీకులను చంపాలని పిస్టోల్‌, మూడు బుల్లెట్లు తీసుకుని అజయ్‌ బైక్‌పై వెళ్తుండగా మంగళవారం కౌటాల మండలం ముత్తంపేట క్రాస్‌రోడ్డు వద్ద ఎన్నికల విధుల్లో తనిఖీ చేస్తున్న పోలీసులకు చిక్కాడు. నిందితుడి వద్ద నుంచి పిస్టోల్‌, తపంచా, రెండు మ్యాగజీన్లు, 15 చిన్న బుల్లెట్లు, ఐదు బుల్లెట్‌ షెల్స్‌, సెల్‌ఫోన్‌, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. నేరం ఒప్పుకోవడంతో అజయ్‌ను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. సమావేశంలో డీఎస్పీ వహీదుద్దీన్‌, సీఐ సంతోష్‌కుమార్‌, ఎస్సైలు చంద్రశేఖర్‌, సందీప్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement