అన్నను చంపిన తమ్ముడి అరెస్ట్
రామకృష్ణాపూర్: మందమర్రి పోలీస్‌స్టేషన్ పరిధిలోని సండ్రోన్‌పల్లిలో అన్నను కొట్టిచంపిన ఘటనలో నిందితుడు మెండ్రపు కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సండ్రోన్‌పల్లికి చెందిన మెండ్రపు కుమార్ అతని అన్న మెండ్రపు గోపాల్ ఇద్దరు ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. గోపాల్ తరచూ మద్యం సేవించి గొడవకు దిగేవాడు. గోపాల్, అతని భార్య గంగా వేధింపుల కారణంగా కుమార్ భార్య చంద్రకళ కూతురుతో సహా ఏడాది క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. దీనికి తోడు రోజువారీ గొడవలు మరింత పెరిగాయి. ఈ నెల1న రాత్రి గోపాల్ మళ్లీ గొడవకు దిగడంతో కోపోద్రిక్తుడైన కుమార్ రోకలి బండతో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమావేశంలో పట్టణ ఎస్సై రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.


