● పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రత్యేకం ● బ్యాలెట్‌లో చేర్చిన
ఎన్నికల గుర్తులు సిద్ధం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మూడు విడతల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల గుర్తులు సిద్ధంగా ఉన్నాయి. సర్పంచ్‌గా అభ్యర్థుల బ్యాలెట్ పేపర్ గులాబీరంగులో, వార్డు సభ్యుల బ్యాలెట్ పేపర్ తెలుపురంగులో ఉంటుంది.
సర్పంచ్ అభ్యర్థుల గుర్తులు
ఉంగరం, కత్తెర, బ్యాట్, ఫుట్‌బాల్, లేడీ పర్సు, టీవీ రిమోట్, టూత్‌పేస్ట్, స్పానర్, కప్పు సాసర్, విమానం, బంతి, షటిల్, కుర్చీ, వంకాయ, బ్లాక్ బోర్డు, కొబ్బరికాయ, మామిడికాయ, సీసా, బకెట్, బుట్ట, దువ్వెన, అరటిపండు, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, క్యారెట్, గొడ్డలి, గాలి బుడగ, బిస్కట్, వేణువు, ఫోర్కు, చెంచా గుర్తులు కేటాయించారు. వీటికింద నోటా గుర్తు విధిగా ఉంటుంది.
వార్డు సభ్యుల గుర్తులు
జగ్గు, గౌను, గ్యాస్ పొయ్యి, స్టూల్, గ్యాస్ సిలిండర్, గాజు గ్లాసు, బీరువా, ఈల, కుండ, డిష్ యాంటెనా, గరాటా, మూకుడు, కేటిల్, విల్లు–బాణము, కవరు, హాకీ బంతి, నెక్ టై, కటింగ్ ప్లేయర్, పోస్టుడబ్బా, విద్యుత్ స్తంభం గుర్తులు ఉన్నాయి. వీటి కింద కూడా నోటా గుర్తు ఉంటుంది.
సర్పంచ్ అభ్యర్థుల గుర్తులు
‘నోటా’కు చోటు..
నిర్మల్‌ఖిల్లా/నిర్మల్‌చైన్‌గేట్: పల్లె పోరు హడావుడి ప్రారంభమైంది. గ్రామాల్లో నామినేషన్‌ల ప్రక్రియ మొదలైంది. ఈ పంచాయతీ ఎన్నికల్లోనూ అభ్యర్థుల గుర్తులతోపాటు ‘నోటా’ (నన్ ఆఫ్ ది ఎబోవ్)ను అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. బ్యాలెట్ పత్రంలో ప్రత్యేకంగా పొందుపరచనున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరూ సరైన వారు లేరని ఓటరు భావించినప్పుడు ఓటును నోటాకు వేసేందుకు అవకాశం కల్పించారు. ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు ఎంతో పవిత్రమైంది. ఓటరు తన ఇష్టానుసారం నాయకుడిని ఎన్నుకోవడమే కాదు.. సరైన అభ్యర్థులు లేరని భావించినప్పుడు తిరస్కరించే హక్కు కూడా కలిగి ఉండాలనే అభిప్రాయం ఏళ్లుగా చర్చకు వచ్చిన అంశమే. ఈ నేపథ్యంలోనే ‘నోటా’ భారత ఎన్నికల వ్యవస్థలో ప్రత్యేక గుర్తింపుతో నిలిచింది. 2013 సెప్టెంబర్ 27న సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుతో ఈ భావనకు చట్టబద్ధత లభించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో, బ్యాలెట్ పత్రాల్లో ‘నోటా’ తప్పనిసరిగా ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. అదే ఏడాది డిసెంబర్ నుంచి దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలన్నింటిలోనూ నోటాకు స్థానం కల్పించింది. లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఓటింగ్ యంత్రాల చివరి బటన్‌గా నోటా ప్రత్యక్షమైంది. నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చినా ఎన్నికల ఫలితంలో మార్పేమీ ఉండదు.
ఒక్క క్లిక్‌తో ఓటరు జాబితా ప్రత్యక్షం
నిర్మల్‌చైన్‌గేట్: పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఓటర్ల తుది జాబితాను ఆన్‌లైన్‌లో ఉంచింది. సదరు వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. వార్డుల వారీగా జాబితా చూడవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు.tsec.gov.in వెబ్‌సైట్ ద్వారా తుది జాబితాను చూసుకోవచ్చు. final rolls GP/ward wise voter list an on 02-09–2025 ఆప్షన్ క్లిక్ చేసి మండలం, జీపీ ఎంచుకుంటే ఓటరు జాబితా ప్రత్యక్షమవుతుంది. క్యాప్చాకోడ్‌ను ఎంటర్ చేసి వార్డువైజ్ డేటాపై క్లిక్ చేస్తే మీ గ్రామ పంచాయతీలోని వార్డుల వైజ్‌గా ఓటరు లిస్ట్ వస్తుంది. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఇలా ఓటరు జాబితాను సులభంగా చూసుకోవచ్చు.
● పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రత్యేకం ● బ్యాలెట్‌లో చేర్చిన


