ఉట్నూర్‌రూరల్: మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నాగాపూర్‌కు చెందిన సయ్యద్ యూసుఫ్ (58)కు సంతానం కాకపోవడంతో మనస్తాపానికి గురై మద్యానికి బానిసయ్యాడు. బుధవారం సాయంత్రం మద్యం మత్తులో ఇంట్లో ఉరేసుకున్నాడు. గమనించిన అతని భార్య భాను స్థానికుల సాయంతో ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుని భార్య భాను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
రైలు కిందపడి ఒకరు...
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన రాళ్లబండి వెంకటి (55) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్‌పీ ఎస్సై మహేందర్ తెలిపారు. వెంకటి ఆరు నెలల క్రితం ద్విచక్రవాహనంపై నుంచి కిందపడడంతో తొంటి విరిగింది. అప్పటి నుంచి మానసికంగా బాధపడుతున్నాడు. గురువారం స్థానిక గోదావరి సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటికి భార్య రాజేశ్వరి, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు జీఆర్‌పీ ఎస్సై తెలిపారు.
అనారోగ్య సమస్యలతో..
సారంగాపూర్: ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువకుడు మండలంలోని చించోలి(బి) సమీపంలో ఉరేసుకున్నాడు. పోలీసులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల మేరకు ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండకు చెందిన ఆల్వేకర్ చరణ్ (25)కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా నయం కాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. బుధవారం నిర్మల్‌కు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి సారంగాపూర్ మండలం చించోలి(బి) గ్రామ సమీపంలోని మహబూబాఘాట్స్ వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. గురువారం పశువుల కాపరులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శ్రీకాంత్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుని సోదరుడు సాయికుమార్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


