అధికారి నిర్లక్ష్యం.. తప్పిన పెనుప్రమాదం
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని కేకేఓసీ గనిలో గురువారం అధికారి నిర్లక్ష్యంతో బొలెరోను డోజర్ ఢీకొట్టిన ఘటనలో పెను ప్రమాదం తప్పింది. గనిలో మొదటి షిప్టులో పనులు జరుగుతుండగా తన కన్వినెన్స్ బొలెరోలో వచ్చిన మేనేజర్ వాహనం దిగి పనిప్రదేశానికి వెళ్లాడు. ఉద్యోగులతో మాట్లాడుతుండగా డ్రైవర్ వాహనాన్ని తిరిగి వెళ్లడానికి అనుకూలంగా తిప్పిపెట్టాడు. అక్కడే డోజర్ ఆపరేటర్ కోల్ లెవల్ పనులు చేపట్టే క్రమంలో వెనకకు వచ్చి బొలెరోను బలంగా ఢీకొట్టాడు. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే వాహనంలోంచి కిందకు దూకడంతో స్వల్పగాయాలుకాగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనలో అధికారి నిర్లక్ష్యం ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. పనిస్థలం వరకు కన్వినెన్స్ వెహికిల్స్ రాకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ సదరు అధికారి ఎందుకు వచ్చారని పలువురు ప్రశ్నిస్తున్నారు.


