ఉత్తమ సేవలకు గుర్తింపు
వేమనపల్లి: అటవీశాఖలో ఉత్తమ సేవలు అందించిన బేస్ క్యాంపు సిబ్బంది శ్రమకు గుర్తింపు లభించింది. ఎమ్ గౌతమ్‌రెడ్డి మెమోరియల్ అవార్డుకు జిల్లా నుంచి ఆరుగురు ఎంపికయ్యారు. మండలంలోని నీల్వాయి రేంజ్ పరిధిలో బేస్ క్యాంపు వాచర్లుగా పనిచేస్తున్న ఏట రాజేశ్, కొడిపె కిష్టయ్య, కోటపల్లి రేంజ్‌కు చెందిన సంపత్, సాగర్ శనివారం గోల్కొండకోటలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. వన్యప్రాణులు, అటవీ సంరక్షణకు అంకితభావంతో పనిచేసినందుకు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా అటవీ రేంజర్ సదానందం, సిబ్బంది అభినందించారు.


