ఉపాధ్యాయ అర్హత.. ‘గురు’తర బాధ్యత
విడుదలైన టెట్ నోటిఫికేషన్.. మొదలైన ఆన్‌లైన్ దరఖాస్తులు పాస్ అయ్యేందుకు ఇన్‌సర్వీసు ఉపాధ్యాయుల మల్లగుల్లాలు సన్నద్ధమవుతున్న ఉమ్మడి జిల్లా ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులు
నిర్మల్‌ఖిల్లా: తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉపాధ్యాయ నియామకాలకు టెట్ అర్హత తప్పనిసరి. ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు కూడా టెట్ అర్హత ఉండాలని సుప్రీంకోర్టు ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు ఎన్‌సీటీఈ మార్గదర్శకాలు విడుదల చేసింది. విద్యాశాఖ తాజా ఉత్తర్వుల్లో ఈ అంశాన్ని ముద్రించింది. దీంతో బీఈడీ, డీఈడీ చేసి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, పీజీహెచ్‌ఎంలుగా విదులు నిర్వహిస్తున్నవారు టెట్ అర్హత సాధించాల్సి ఉంటుంది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు.
నోటిఫికేషన్ విడుదల..
ప్రస్తుతం టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ల ప్రక్రియ ప్రారంభమైంది. డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన నిరుద్యోగులు, ఇన్‌సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈనెల 29వరకు గడువు ఉంది. జనవరిలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు.
కొత్త మార్గదర్శకాలు..
ఎన్‌సీటీఈ, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రతీ ఉపాధ్యాయుడికి టెట్‌లో అర్హత ఉండాలి. టెట్‌ను తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో టెట్ హాజరు తప్పనిసరి అవుతోంది. డీఈడీ, బీఈడీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు కూడా టెట్ అర్హతకు సిద్ధమవుతున్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో గుబులు..
పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 9,791 మంది ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 2012, 2017, 2024 డీఎస్సీ ద్వారా వచ్చినవారు టెట్ అర్హత సాధించి ఉన్నారు. ఇంతకు ముందు నియామకమైన ఉపాధ్యాయులు 5,590 మందికి టెట్ అర్హత లేదు. వీరంతా పరీక్షకు సిద్ధమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజా ప్రమోషన్లలో వీరంతా టెట్ అర్హత లేకుండానే పదోన్నతి పొందారు. వీరంతా ఇప్పుడు టెట్ అర్హత తప్పక సాధించాలి.
జిల్లాల వారీగా వివరాలు..


