సమస్యాత్మకంగా రైతు వేదికలు | - | Sakshi
Sakshi News home page

సమస్యాత్మకంగా రైతు వేదికలు

Nov 17 2025 3:49 PM | Updated on Nov 17 2025 3:49 PM

సమస్య

సమస్యాత్మకంగా రైతు వేదికలు

● రైతులకు ఉపయోగపడని వైనం ● కొన్నిచోట్ల మందుబాబులకు అడ్డా..

● రైతులకు ఉపయోగపడని వైనం ● కొన్నిచోట్ల మందుబాబులకు అడ్డా..

మంచిర్యాలటౌన్‌: రైతుల సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వం నిర్మించిన రైతు వేదికలు ఇప్పుడు నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయి. ఐదు వేల హెక్టార్లకు ఒక క్లస్టర్‌గా విభజించి ఒక్కో రైతు వేదిక నిర్మాణానికి రూ.25 లక్షలు వెచ్చించింది. ఊరికి దూరంగా ఉండడం, నిర్వహణకు నిధులు మంజూరు కాకపోవడంతో ప్రస్తుతం ఈ వేదికలు నిరుపయోగంగా మారాయి. ఏఈవోలు కార్యాలయాలుగా వినియోగిస్తున్నా.. చాలాచోట్ల పాములకు ఆశ్రయంగా, కొన్ని కేంద్రాలు మందు బాబులకు అడ్డాగా మారాయి.

అడుగు పెట్టలేం..

దండేపల్లి మండలంలో ఆరు రైతు వేదికలు నిర్మించారు. ఐదు రైతువేదికలు బాగానే ఉన్నా, ఒకటి మాత్రం అడుగు కూడా పెట్టలేని విధంగా మారింది. మేదరిపేట రైతువేదిక అధ్వానంగా మారింది. ఫ్లోర్‌ మొత్తం కుంగిపోయి పాములు ఆవాసం ఉంటున్నాయి. అందులో అడుగుపెట్టేందుకు అధికారులు, సిబ్బంది, రైతులు భయపడుతున్నారు.

జన్నారంలో..

మండలంలో దేవునిగూడ, కలమడుగు, పొనకల్‌, చింతగూడ గ్రామాల్లో రైతువేదికలు నిర్మించారు. ఏఈవోలు అందుబాటులో ఉండి రైతులకు సేవలందించాల్సి ఉండగా, కేవలం ప్రభుత్వ పరమైన సమావేశాలకు తప్ప రైతు వేదికలను ఉపయోగించడం లేదు. కలమడుగులో కోతులు చొరబడి ఫ్యాన్లు, గదులను చిందరవందర చేయగా రైతులు మరమ్మతులు చేయించారు. పొనకల్‌లో వ్యవసాయ పరమైన సమావేశాలు, ప్రభుత్వం రైతులకు ఇచ్చే సందేశాత్మక వీడియో కాన్ఫరెన్స్‌లకు మాత్రమే వాడుతున్నారు.

లక్సెట్టిపేటలో..

లక్సెట్టిపేట మండలంలో జెండావెంకటాపూర్‌, దౌడపల్లి, లక్సెట్టిపేట, వెంకట్రావుపేట, సూరారం గ్రామాలలో రైతు వేదికలు ఉన్నాయి. జెండావెంకటాపూర్‌ రైతు వేదికలో ఎడమవైపు డోర్‌ పగిలిపోయింది. మరుగుదొడ్లు శిధిలావస్థకు చేరుకున్నాయి. దౌడపల్లి భవనం కిటికీ అద్దాలు పగిలిపోయాయి.

నస్పూర్‌ మండలంలో..

నస్పూర్‌ పట్టణ పరిధిలోని సీతారాంపల్లిలో నిర్మించిన రైతు వేదిక మందుబాబులకు అడ్డాగా మారింది. రైతు వేదిక చుట్టూ ప్రహరీ లేక పోవడంతో రాత్రి సమయంలో మందు బాబులు రైతు వేదిక వద్ద మద్యం సేవించి మందు బాటిళ్లు అక్కడే పడేసి వెళ్తున్నారు.

కోటపల్లి రైతువేదికలో ఊడిన తలుపులు

దండేపల్లి: మేదరిపేట రైతువేదికలో కుంగిన ఫ్లోర్‌

కిష్టంపేట రైతు వేదిక ముందు భాగంలో నిర్మించిన గోడ

బెల్లంపల్లి నియోజకవర్గంలో..

బెల్లంపల్లి: ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వంతో బెల్లంపల్లి నియోజకవర్గంలో రైతు వేదికలు గాడితప్పాయి. నియోజకవర్గంలో 18 రైతు వేదికలు ఉండగా సగానికిపైగా తలుపులు అడపాదడపా తెరుస్తున్నారు. గ్రామాలకు దూరంగా ఉండడంతో రైతులు వినియోగించుకోలేక పోతున్నారు. ప్రతీవారం వీడియో కాన్పరెన్స్‌ అతికష్టంగా నిర్వహిస్తున్నారు. మరుగుదొడ్లు ఉన్నా.. నీటిసౌకర్యం లేదు. తలుపులు, కిటికీల రెక్కలు ఊడిపోయి అధ్వానంగా తయారయ్యాయి. సమావేశాలకు హాజరైన రైతులు, వ్యవసాయ అధికారులు ఇబ్బంది పడుతున్నారు. వేదికల్లో ప్యాన్లు పని చేయడం లేదు.

భారంగా కరెంట్‌ బిల్లులు :

రైతు వేదికల కరెంట్‌ బిల్లులు తడిసి మోపెడవుతున్నాయి. రైతు వేదిక నిర్వహణ కోసం ప్రభుత్వం నెలకు రూ.9 వేల చొప్పున బిల్లు మంజూరు చేయాల్సి ఉండగా కొన్నాళ్ల నుంచి రావడం లేదు. కరెంట్‌బిల్లు, అటెండర్‌ జీతం చెల్లించడం లేదు. బిల్లుల చెల్లింపులు జరగక పోవడంతో కరెంట్‌ కనెక్షన్‌ తొలగిస్తామని ఎప్పటి కప్పుడు ట్రాన్స్‌కో అధికారులు ఆల్టిమేటం జారీ చేస్తున్నారు.

చెన్నూర్‌రూరల్‌: చెన్నూర్‌ నియోజకవర్గంలోనూ రైతు వేదికల పరిస్థితి అధ్వానంగానే ఉంది. చె న్నూర్‌ మండలంలో అంగ్రాజ్‌పల్లి, సోమనపల్లి, సుందరసాల, శివలింగాపూర్‌, ఆస్నాద, కిష్టంపేట గ్రామాల్లో రైతు వేదికలు ఉన్నాయి. ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. సుందరసాల, సోమనపల్లి, అంగ్రాజ్‌పల్లి, శివలింగాపూర్‌ గ్రామాల రైతు వేదికలు గ్రామాలకు దూరంగా ఉన్నాయి. సమావేశాలకు వెళ్లేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. శివలింగాపూర్‌ రైతు వేదికలో రెండుసార్లు చోరీ జరిగింది. 12 ఫ్యాన్లు ఎత్తుకెళ్లారు. కి ష్టంపేట రైతు వేదికలో ముందు భాగంలో ఉన్న డోర్లు బద్దలు కొట్టి మానిటర్‌, స్పీకర్లను ఎత్తుకెళ్లారు.

కోటపల్లి మండలంలో..

కోటపల్లి: మండలంలో కోటపల్లి, మల్లంపేట, వెలమపల్లి, సిర్సాలో రైతు వేదికలు ఉన్నాయి. వీటికి రక్షణ కరువైంది. వెలమపల్లి, సిర్సా రైతు వేదికల్లోనూ తలుపులు చెదలుపట్టి పోయాయి. వ్యవసాయా విస్తరణ అధికారులు కూడా అటువైపు కన్నెత్తి చూడడం లేదు.

మందమర్రిలో సౌకర్యాలు కరువు..

మందమర్రిరూరల్‌: మండలంలో బొక్కలగుట్ట, శంకర్‌పల్లి గ్రామ పంచాయితీ పరిధిలోని సండ్రోన్‌పల్లి వద్ద ప్రభుత్వ రైతువేదికలు ఉన్నాయి. గ్రామాలకు దూరంగా ఉన్నాయి. ప్రహరీలు లేకపోవడంతో దొంగతనాలు జరుగుతున్నాయి. మందుబాబులకు అడ్డాగా మారాయి. పలుమార్లు దొంగలుపడి పైపులైన్‌ ధ్వంసం చేసి వాటర్‌ ట్యాంకులు ఎత్తుకెళ్లారు.

భీమారం మండలంలో..

భీమారం: మండల కేంద్రంలోని రైతువేదికలో ఫ్యాన్లు పనిచేయడం లేదు. స్విచ్‌బోర్డుల్లో మంటలు వచ్చి లైట్లు, ఫ్యాన్లు కాలిపోతున్నాయి. రైతు వేదికకు ప్రత్యేకంగా నీటిసరఫరా లేక పోవడంతో హరితహారం నర్సరీకి చెందిన బోరుబావి నుంచి కనెక్షన్‌ ఇచ్చారు. బోరు కాలిపోవడంతో నీటిసరఫరా నిలిచిపోయింది.

సమస్యాత్మకంగా రైతు వేదికలు 
1
1/5

సమస్యాత్మకంగా రైతు వేదికలు

సమస్యాత్మకంగా రైతు వేదికలు 
2
2/5

సమస్యాత్మకంగా రైతు వేదికలు

సమస్యాత్మకంగా రైతు వేదికలు 
3
3/5

సమస్యాత్మకంగా రైతు వేదికలు

సమస్యాత్మకంగా రైతు వేదికలు 
4
4/5

సమస్యాత్మకంగా రైతు వేదికలు

సమస్యాత్మకంగా రైతు వేదికలు 
5
5/5

సమస్యాత్మకంగా రైతు వేదికలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement