సర్కారు బడులకు క్రీడానిధులు
మంచిర్యాలఅర్బన్: క్రీడలు.. విద్యార్థుల్లో శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తాయి. అలాగే వారిలో ఆత్మవిశ్వాసం, మానసిక చురుకుదనానికి దోహదం చేస్తాయి. ఈ మేరకు పాఠశాల స్థాయిలో నే విద్యార్థులు క్రీడల్లో రాణించేలా ప్రభుత్వం ఫోక స్ పెంచింది. ఇందులో భాగంగా 2025–26 విద్యా సంవత్సరానికి తెలంగాణ సమగ్ర శిక్ష ద్వారా సర్కా రు బడులకు 50 శాతం క్రీడా నిధులు మంజూరు చేసింది. ఆటలపై శిక్షణతో పాటు క్రీడా సామగ్రికి వీటిని వెచ్చించనున్నారు.
రెండు విడతల్లో ..
పాఠశాల స్థాయిలో క్రీడలకు అవసరమైన నిధులు రెండు విడతల్లో మంజూరు చేస్తారు. మొదటి విడతలో 50 శాతం నిధులు విడుదల చేశారు. ప్రాథమిక పాఠశాలలకు రూ.5 వేలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.10 వేలు, జెడ్పీ ఉన్నత పాఠశాలలకు రూ.25 వేల చొప్పున చెల్లించనున్నారు. వాటితో షాట్‌పుట్, డిస్కస్‌త్రో, స్కిప్పింగ్, సాఫ్ట్‌బాల్, టెన్నిస్‌బాల్, వాలీబాల్, హ్యాండ్‌బాల్, త్రోబాల్, టెన్నిస్ బాల్, తదితర ఆటవస్తువులు కొనుగోలు చేయాల్సి ఉటుంది. పాఠశాలలకు కేటాయించిన స్పోర్ట్స్ గ్రాంట్‌ను గైడ్‌లైన్స్ ప్రకారం ఖర్చుచేయాల్సి ఉంటుంది. ఇట్టి నిధులతో ఆట స్థలాలు చదును వంటి పనులు చేయించరాదనే ఆదేశాలు ఉన్నాయి. పాఠశాలల వారీగా ఆటవస్తువులు కొనుగోలు చేసి ఫొటో తీయాలనే నిబంధనలు విధించారు. గ్రాంట్ సద్వినియోగం చేసుకుని విద్యార్థులను క్రీడాపోటీల్లో ప్రోత్సహించాలని అధికారులు ఆదేశించారు.
ప్రైమరీ, యూపీఎస్, ఉన్నత పాఠశాలలకు ఇలా..
ఆదిలాబాద్ జిల్లాలో 404 ప్రైమరీ పాఠశాలలకు రూ.20.20 లక్షలు, 75 యూపీఎస్‌లకు రూ.7.50 లక్షలు, 85 హైస్కూళ్లకు రూ.21.25 లక్షలు, 15 హెచ్‌ఎస్‌ఎస్‌లకు రూ. 3.75 లక్షలు స్పోర్ట్స్ నిధులు కేటాయిస్తారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 313 ప్రైమరీ పాఠశాలలకు రూ.15.65 లక్షలు, 68 యూపీఎస్‌లకు రూ.6.80 లక్షలు, 46 హెచ్‌ఎస్‌లకు రూ.11.50 లక్షలు, 9 హెచ్‌ఎస్‌ఎస్‌లకు రూ.2.25 లక్షలు, నిర్మల్ జిల్లాలో 350 ప్రైమరీ పాఠశాలలకు రూ.17.50 లక్షలు, 77 యూపీఎస్‌లకు రూ.7.70 లక్షలు, 107 హెచ్‌ఎస్‌లకు 26.75 లక్షలు, 14 హెచ్‌ఎస్‌ఎస్‌లకు రూ. 3.5 లక్షలు, మంచిర్యాల జిల్లాలోని 360 ప్రైమరీ పాఠశాలలకు రూ.18.00 లక్షలు, 81 యూపీఎస్‌లకు రూ. 8.10 లక్షలు, 97 హెచ్‌ఎస్‌లకు రూ.24.25, 16 హెచ్‌ఎస్‌ఎస్‌లకు రూ.4 లక్షల క్రీడా నిధులు కేటాయించనున్నారు.
ఉమ్మడి జిల్లా వారీగా నిధుల వివరాలు (రూ.లక్షల్లో)


