మామిడిలో జాగ్రత్తలు తప్పనిసరి
చెన్నూర్‌రూరల్: మామిడిలో పూతకు ముందు, కాయదశలో ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి పాటించడంతోనే దిగుబడి సాధించవచ్చునని హెచ్‌వో కళ్యాణి పేర్కొంటున్నారు. మంచిర్యాల జిల్లావ్యాప్తంగా రైతులు సుమారు 18 వేల ఎకరాలకు పైగా మామిడి తోటలు సాగు చేస్తున్నారు. జూన్ నుంచి అక్టోబర్ వరకు పాటించిన సమగ్ర పద్ధతులను బట్టి నవంబర్‌లో ముదిరిన రెమ్మల్లో పూత మొగ్గ ఏర్పడుతుంది. వాతావరణ పరిస్థితి దృష్ట్యా డిసెంబర్ రెండో వారం నుంచి జనవరి మొదటి వారం వరకు పూత మొగ్గలు రావడం మొదలవుతుంది. ఒక్కోసారి చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఆలస్యంగా కనిపిస్తాయి. పూత మొగ్గలను ఉత్తేజపరిచి త్వరగా పూత తెప్పించడానికి ఈ పద్ధతులు పాటిస్తే పూత బయటకు వస్తుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నీటి వసతి ఉన్న మామిడి తోటల్లో చెట్ల పొదల్లో నీటితడి అందించాలి. ఒక లీటర్ నీటికి వెట్టబుల్ సల్ఫర్ 5 గ్రాములు కలిపి పిచికారీ చేస్తే పూత మొగ్గలు ఒకేసారి చిగురిస్తాయి. లేదా ఒక లీటరు నీటికి పొటాషియం నైట్రేట్(మల్టికే) 10 గ్రాములతోపా టు యూరియా 10 గ్రాములు కలిపి పిచికారీ చేయా లి. ఈ పద్ధతులను ముందస్తు పాటిస్తే పూత బాగా రావడమే కాకుండా, కాయలు రాలిపోకుండా ఉంటాయి. ఇలాంటి జాగ్రత్తలు పాటించడంతోనే రైతులు మామిడిలో అధిక దిగుబడి సాధించవచ్చు.


