జోనల్‌స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ క్రీడా పాఠశాలకు చెందిన విద్యార్థులు అథ్లెటిక్స్ జోనల్ స్థాయి పోటీల్లో సత్తా చాటారు. ఈ నెల 8వ తేదీన ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎస్జీఎఫ్ అండర్ –14, 17 బాల, బాలికల అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబరిచారు. అండర్ 14 బాలికల విభాగంలో 100 మీటర్ల పరుగు, హై జంప్‌లో వి.సంజన స్వర్ణ పతకాలు సాధించగా, 200 మీటర్ల ఈవెంట్‌లో రజత పతకంతో మెరిసింది. షాట్‌ఫుట్ ఈవెంట్‌లో నర్మద రజత పతకంతో సత్తా చాటగా, మల్లీశ్వరి 100 మీటర్ల పరుగు, 400 మీటర్ల పరుగులో కాంస్య పతకాలతో విజేతలుగా నిలిచారు. బాలుర విభాగంలో షాట్‌ఫుట్ ఈవెంట్‌లో అర్జున్ నాయక్ రజతంతో మెరిశాడు. అండర్ –17 బాలికల విభాగంలో టి.స్వాతి 200 మీటర్ల పరుగులో స్వర్ణ పతకం, 100 మీటర్ల హార్దిల్స్, హైజంప్ ఈవెంట్‌లో రజత పతకాలతో మెరిసింది. ఎం. శివాని 3 వేల మీటర్ల రేస్‌వాక్ ఈవెంట్‌లో స్వర్ణ పతకంతో సత్తా చాటింది. పి. కావ్య 100 మీటర్ల పరుగులో రజత పతకంతో మెరిసింది. బాలుర విభాగంలో వి. మహేశ్ జావెలిన్ త్రో ఈవెంట్‌లో రజత పతకంతో సత్తా చాటగా, డీ.యువరాజ్ 110 మీటర్ల హార్దిల్స్, 400 మీటర్ల పరుగులో రజత పతకాలతో మెరిసినట్లు అథ్లెటిక్స్ కోచ్ రమేశ్ తెలిపారు. జోనల్ పోటీల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులు ఈ నెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు హైదరాబాద్‌లోని జింఖానా మైదానంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించనున్నట్లు వివరించారు. డీవైఎస్‌వో జక్కుల శ్రీనివాస్, జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్ రెడ్డి, తదితరులు అభినందనలు తెలిపారు.


