ఆత్మహత్యలను అడ్డుకుందాం!
మంచిర్యాలక్రైం/దండేపల్లి: సమాజంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. భారతదేశంలో గంటకు సుమారు 14 ఆత్మహత్యలు జరుగుతున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. మంచిర్యాల జిల్లాలో వివిధ కారణాలతో 2024 –2025 అక్టోబర్ వరకు 836 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆత్మహత్యలకు గల ప్రధాన కారణాలు వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక, మానసిక కారకాలు కలిపి ఉంటాయని ప్రముఖ కౌన్సెలింగ్ సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్ బానవత్ ప్రకాశ్ పేర్కొంటున్నారు.
ప్రధాన కారణాలు..
మానసిక, ఆర్థిక సమస్యలు ఆత్మహత్యలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. సామాజిక, విద్య, కెరీర్ ఒత్తిళ్లు, శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు, విడాకులు లేదా సంబంధ విభేదాలు, కుటుంబ సమస్యలు, ప్రేమ విఫలం కావడం, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, ఆత్మన్యూనత, సామాజిక మీడియా ప్రభావం కూడా బలవన్మరణాలకు దోహదపడుతున్నాయి.
నివారించే చర్యలు..
● మానసిక సమస్యలపై అవగాహన కల్పించడం వల్ల ఆత్మహత్యలు చేసుకోకుండా నివారించవచ్చు.
● సైకాలజిస్టు, కౌన్సిలర్‌తో తక్షణ మానసిక సలహా అందించాలి.
● విద్యార్థులకు పరీక్షల సమయంలో ఒత్తిడి లేకుండా చూడాలి.
● ఆర్థిక కష్టాలు ఎదుర్కొనేవారికి సాయం చేయడంతో పాటు ప్రణాళికతో ముందుకెళ్లేలా ప్రోత్సహించాలి.
● మద్యపానం, డ్రగ్స్ జోలికి వెళ్లకుండా చూడాలి.
● వ్యక్తులను ఒంటరిగా ఉండనివ్వకుండా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి.
బానవత్ ప్రకాశ్


