చిరువ్యాపారులపై కమిషనర్ జులుం
చెన్నూర్: వివిధ రాష్ట్రాల నుంచి పొట్ట చేతపట్టుకుని వచ్చి చిరువ్యాపారాలు చేసుకుంటున్న వారిని వేధింపులకు గురిచేస్తున్న కమిషనర్ మురళీకృష్ణను సస్పెండ్ చేయాలని మజ్దూర్ సంఘ్ జిల్లా కార్యదర్శి మద్దూరి రాజుయాదవ్ డిమాండ్ చేశారు. కమిషనర్ తీరును నిరసిస్తూ ఆదివారం నల్లబ్యాడ్జీలు ధరించి ఆర్టీసీ బస్టాండ్ నుంచి ర్యాలీగా వచ్చి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల నుంచి బ్లాంకెట్లు, చద్దర్లు అమ్ముకుని జీవనం సాగించేందుకు 40 ఏళ్లుగా వ్యాపారులు వస్తున్నారని తెలిపారు. కమిషనర్ వారివద్ద డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, లేదంటే షాపులను జేసీబీలతో తొలగించి డంపింగ్ యార్డుకు తరలిస్తానని వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రచార కార్యదర్శి రత్నాకర్ మహదేవ్, నాయకులు దుర్గం రాజమల్లు, చిరు వ్యాపారులు కిషన్, విజయ్, సాగర్, కిరణ్, మహేశ్, తదితరులు పాల్గొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
