ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడి మృతి
ఖానాపూర్: ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడు మృతిచెందినట్లు ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కడెం మండలం ఉడుంపూర్ పంచాయతీ పరిధి గండిరాంపూర్‌కు చెందిన గాదె నరేశ్(22) గత కొంతకాలంగా ఖానాపూర్ మండలం సత్తన్‌పల్లి పంచాయతీ పరిధిలోని రాంరెడ్డిపల్లెలో నివాసం ఉంటున్నాడు. గతనెల 31న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబీకులు, గ్రామస్తులు ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. గ్రామంలో అడ్ప లక్ష్మారెడ్డి మామిడి తోటలో వ్యవసాయ బావిలో ఆదివారం మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. నరేశ్ మానసిక సమస్యతోపాటు మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈక్రమంలో బహిర్భూమికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడని ఎస్సై తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
