గూడెం గుట్ట..భక్తుల కిటకిట
దండేపల్లి: మండలంలోని గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో కార్తిక సందడి కొనసాగుతోంది. ఆదివారం ఉమ్మడి జిల్లా నుంచేకాక ఇతర జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో గూడెం గుట్ట భక్తులతో కిటకిటలాడింది. సత్యదేవున్ని దర్శించుకుని పూజలు చేశారు. 905 జంటలు సామూహిక సత్యనారాయణ వ్రతాలు నోముకున్నారు. గుట్ట కింద రావిచెట్టు వద్ద గుట్టపైన ఖాళీ ప్రదేశంలో మహిళలు కార్తిక దీపాలు వెలిగించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. ఈవో శ్రీనివాస్, సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. సుమారు 600 మందికి అన్నదానం చేశారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
