
చెన్నూర్ మున్సిపల్ కమిషనర్‌పై ఫిర్యాదు
చెన్నూర్: చెన్నూర్ మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపాలి టీలో గతంలో విధులు నిర్వర్తించిన ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్ హరికాంత్ తాజాగా పోలీసులకు ఫిర్యా దు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తన ఒప్పంద కాలం పూర్తయినా, నూతనంగా కొనసాగింపు ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా ఉద్యోగం నుంచి తొలగించారని, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు తనకు రావాల్సిన వేతనం రూ.94,962 చెల్లించకుండా వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
గతంలోనూ వివాదాలు..
మున్సిపల్‌లో కాంట్రాక్ట్ పనులు నిర్వహించిన సునీల్‌రెడ్డి కూడా ఇలాంటి సంఘటనను ఎదుర్కొన్నాడని చెబుతున్నారు. తనకు చెల్లించాల్సిన బిల్లులు ఇవ్వడంలో ఆలస్యం చేయడంతో ఆగస్టు 7న సునీల్‌రెడ్డి కమిషనర్‌తో వాగ్వాదానికి దిగాడు. కార్యాలయ ప్రాంగణంలోనే ఇద్దరూ గొడవ పడ్డారు. అనంతరం సునీల్‌రెడ్డి చెన్నూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడని సమాచారం.
కమిషనర్ ప్రవర్తనపై విమర్శలు
మురళీకృష్ణ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మున్సిపల్ కార్యకలాపాలు వివాదాస్పదంగా మారాయి. ప్రజా సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారితో కమిషనర్ దురుసుగా మాట్లాడుతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. కమిషనర్ రాకతో అభివృద్ధి పనులు మందగించాయని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.
సిబ్బందికి వేధింపులు..
వార్డు ఆఫీసర్లను ఆదివారం విధులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. మహిళావార్డు ఆఫీసర్ ఆదివారం కార్యాలయానికి రాకపోవడంతో కమిషనర్ నోటీసు పంపినట్లు తెలిసింది. దీంతో ఆగమేఘాల మీద విధులకు హాజరైన సదరు వార్డు ఆఫీసర్ కార్యాలయంలో స్పృహతప్పి పడిపోయింది. ఈ విషయం బయటికి పొక్కకుండా వాహనం మాట్లాడి మంచిర్యాల ఆస్పత్రికి తరలించి చికిత్సలు చేయించారని తెలిసింది. ఈ విషయమై కమిషనర్‌ను ఫోన్‌లో సంప్రదించగా స్పందించలేదు.
ఉద్యోగి ఫిర్యాదు చేశారు..
వేతనం ఇవ్వకుండా మానసికంగా, ఆర్థికంగా చెన్నూర్ మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ వేధిస్తున్నాడని ఎన్విరాన్‌మెంట్ ఉద్యోగి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నాం.
– దేవేందర్‌రావు, సీఐ, చెన్నూర్