
అందరికీ అనుమతి ఇప్పించింది ఒక్కరే..!
జిల్లాలో 103 బాణాసంచా దుకాణాలకు అనుమతి
ఒక్కో దరఖాస్తుకు రూ.30వేలు వసూలు
అధికారులకు దీపావళి ధమాకా..!
ఏటా రూ.కోట్లలో టపాసుల వ్యాపారం
మంచిర్యాలక్రైం: దీపావళి పండుగ వచ్చిందంటే చాలు బాణాసంచా దుకాణాల వ్యాపారులకు లాభాలు రాకెట్‌లా దూసుకెళ్తాయి. పండుగకు టపాసుల విక్రయాలు రూ.కోట్లలో జరుగుతాయి. ఇది అధికారులకు దీపావళి ధమాకా అన్నట్లుగా పండుగ చేసుకుంటారు. టపాసులు విక్రయించేందుకు తాత్కాలిక అనుమతి కోసం ఫైర్, కమర్షియల్, మున్సిపల్, రెవెన్యూ, ఎలక్ట్రిసిటి, పోలీసు శాఖ అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. టపాసుల వ్యాపారం రూ.కోట్లలో సాగుతుంది. జిల్లాలో ఆరు హోల్‌సేల్ దుకాణాలు ఉండగా.. దీపావళి పండుగకు తాత్కాలికంగా టపాసుల విక్రయ దుకాణాల అనుమతి కోసం 105 మంది దరఖాస్తు చేసుకోగా.. 103 దుకాణాలకు అనుమతి లభించింది. నిబంధనల ప్రకారం ఎవరికి వారే వ్యక్తిగతంగా అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేస్తే ఆయా శాఖల అధికారులు లేనిపోని కొర్రీలతో దరఖాస్తులు తిరస్కరించడం, కార్యాలయాల చుట్టూ తిప్పుకోవడం ‘మామూలు’గానే జరుగుతుంది. ఇదంతా తలనొప్పి ఎందుకని జిల్లా కేంద్రంలోని ఓ ప్రముఖ వ్యాపారి ఒక్కొక్కరి వద్ద రూ.30వేలు తీసుకుని అన్నీ తానై దగ్గరుండి అన్ని శాఖల అధికారులకు నజరానాలు ముట్టజెప్పి తాత్కాలిక అనుమతులు ఇప్పించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గత కొన్నేళ్లుగా ఇలాగే జరుగుతోందని పలువురు వ్యాపారులు చెప్పుకోవడం గమనార్హం.
జీరో మాల్
జిల్లాకు ఎక్కువగా తమిళనాడు రాష్ట్రంలోని శివకాశి నుంచి టపాసులు దిగుమతి అవుతుంటాయి. జీరో మాల్ కావడంతో కొందరు పేరున్న డీలర్లు సేల్స్‌టాక్స్ అధికారులకు ముడుపులు ముట్టజెప్పి తతంగం నడిపిస్తుంటారనే విమర్శలున్నాయి. తాత్కాలిక దుకాణాల్లో విక్రయాలకు వ్యాపారుల నుంచి జిల్లా కేంద్రంలోని వ్యాపారి నెల రోజుల ముందే వ్యాపారుల దరఖాస్తులు తీసుకుని ఒక్కొక్కరి వద్ద తాత్కాలిక అనుమతికి రూ.30వేలు వసూలు చేసినట్లు సమాచారం. దీపావళి పండుగ మూడు రోజులే అంటూ ఒక్కో దరఖాస్తుకు ఇంతా అని లెక్కలేసి ముట్టజెప్పారనే ఆరోపణలున్నాయి. ఇక సేల్స్‌టాక్స్ అధికారులకు మూడు రోజుల్లో రూ.30వేల నుంచి రూ.50వేల వరకు అమ్మకాలు జరిగినట్లు టాక్స్ చెల్లించినట్లు డీడీ సమర్పిస్తారు. రూ.లక్షల్లో సరుకు విక్రయాలు చేపట్టినా కమర్షియల్ టాక్స్ అధికారులు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.