
దరఖాస్తులు తక్కువే.. ఆదాయం ‘ఫుల్’
మంచిర్యాలక్రైం: కొత్త మద్యం పాలసీ 2025–27 అమలుకు ప్రభుత్వం గత నెల 26 నుంచి ఈ నెల 18వరకు జిల్లాలోని 73 మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించింది. శనివారం చివరి రోజు కావడంతో ఉత్కంఠభరితంగా దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. గతంలో కంటే దరఖాస్తుల సంఖ్య తగ్గినా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం వచ్చేసిందని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 23న లక్కీడ్రా పద్ధతిలో మద్యం దుకాణాల ఎంపికకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని 73 మద్యం దుకాణాలకు గాను 1,617 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో దరఖాస్తుకు రూ.3లక్షలు కాగా.. ఈ లెక్కన ప్రభుత్వానికి రూ.48.51 కోట్ల ఆదాయం సమకూరింది. సాయంత్రం ఆరు గంటల వరకే దరఖాస్తుల స్వీకరణ కాగా.. చివరి రోజు అధిక సంఖ్యలో రావడంతో గంట గంటకు దరఖాస్తుల సంఖ్య పెరిగింది. ఏ దుకాణానికి ఎన్ని వచ్చాయనే సమాచారం నోటీసు బోర్డుపై ఉంచారు. ఏ దుకాణానికి తక్కువ టెండర్లు పడ్డాయో చూసుకుంటూ వ్యాపారుల దరఖాస్తు చేశారు. నిర్ణీత సమాయానికి వచ్చిన వ్యాపారులకు టోకెన్ ఇచ్చి రాత్రి వరకు దరఖాస్తులు స్వీకరించారు. గతేడాది 73 మద్యం షాపులకు 2242 దరఖాస్తులు వచ్చాయి. ఇందారం దుకాణానికి అత్యధికంగా 60 దరఖాస్తులు రాగా, కన్నెపల్లికి ఒక్కటే వచ్చింది.