
పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) పి.చంద్రయ్య, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి డివిజనల్, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, ప్రాథమిక సహకార సంఘాల కార్యదర్శులతో వరి ధాన్యం కొనుగోలుపై సన్నాహక, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1,57,642 ఎకరాల్లో వరి సాగైందని, 3,58,970 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేశామని, 2,32,743 మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలో 301 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. వరి ధాన్యానికి కనీస మద్దతు ధర గ్రేడ్ ఏ రకానికి క్వింటాల్‌కు రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 నిర్ణయించినట్లు తెలిపారు. సన్న రకానికి మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్ అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్ రావు, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మరావు, జిల్లా మేనేజర్ శ్రీకళ, జిల్లా రవాణా అధికారి సంతోష్‌కుమార్, లీడ్ బ్యాంకు డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి, జిల్లా సహకార అధికారి రాథోడ్ బిక్కు, డీసీఎంఎస్ ఆదిలాబాద్ మేనేజర్ ప్రమోద్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.