
పకడ్బందీగా ధాన్యం సేకరించాలి
మంచిర్యాల అగ్రికల్చర్: ఖరీఫ్ సీజన్ వరి ధాన్యం సేకరణ పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆయా శాఖల కమిషనర్లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాలు, మార్కెటింగ్, సహకార, గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ, రవాణా, పోలీస్ శాఖల అధికారులతో ఖరీఫ్ సీజన్ వరి ధాన్యం కొనుగోలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ వరి ధా న్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఏ గ్రేడ్ రకానికి క్వింటాలుకు రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 మద్దతు ధర నిర్ణయించినట్లు తెలిపారు. సన్న రకం వడ్లకు మద్దతు ధరతోపాటు క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తామని అన్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ రైతులకు కనీస మౌలిక వసతులు కల్పించడంతోపాటు నిర్ణీత వ్యవధిలో చెల్లింపులు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) పి.చంద్రయ్య, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బ్రహ్మరావు, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీకళ పాల్గొన్నారు.