
సంక్షోభంలో శ్రీరాంపూర్ ఓసీపీ
శ్రీరాంపూర్: సింగరేణి సంస్థలో ఎక్కడా లేని విధంగా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గని (ఓసీపీ) తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఓబీ (మట్టి వెలికితీత) పనులు చేసే రెండు కాంట్రాక్టు సంస్థలు చేతులెత్తేయడంతో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. ఓబీ వెలికితీత టెండర్‌ను సీఆర్‌ఆర్, జీవీఆర్ సంస్థలు దక్కించుకున్నాయి. నాలుగేళ్లు నిర్ధేశిత ఓబీ వెలికి తీసేలా ఒప్పందం చేసుకున్నాయి. 2022 డిసెంబర్ 1 నుంచి సీఆర్‌ఆర్ పనులు చేపట్టింది. 2023 అక్టోబర్ 1 నుంచి జీవీఆర్ పనులు ప్రారంభించింది. సీఆర్‌ఆర్ సంస్థ 720 లక్షల క్యూబిక్ మీటర్లు తీయాల్సి ఉండగా అక్టోబర్ 1 వరకు 360 లక్షల క్యూబిక్ మీటర్లు మాత్రమే వెలికితీసింది. ఇక జీవీఆర్ సంస్థ 495 లక్షల క్యూబిక్ మీటర్లు తీయాల్సి ఉండగా 220 లక్షల క్యూబిక్ మీటర్లు మాత్రమే తీసింది.
నష్టాలు వస్తున్నాయని..
నష్టాలు వస్తున్నాయని ఆ రెండు సంస్థలు అర్ధంతరంగా పనులు నిలిపివేశాయి. సీఆర్‌ఆర్ ఆగస్టు 27 నుంచి, జీవీఆర్ అక్టోబర్ 1 నుంచి పనులు చేయడం లేదు. టెండర్ ప్రకారం నాలుగేళ్ల కాలానికి నిర్ధేశించిన ఓబీ తీయాల్సి ఉండగా తమతో ఇక కాదని చేతులెత్తేశాయి. జీవీఆర్ సంస్థ ముందుగా నోటీసులు ఇచ్చి పనులు బంద్ చేయగా, సీఆర్‌ఆర్ సంస్థ చెప్పా పెట్టకుండానే పనులు నిలిపివేసింది. ఈ సంస్థకు కంపెనీ పలుమార్లు నోటీసులు ఇచ్చింది. ఇదిగో వస్తాం.. చేస్తాం.. అంటూ తప్పించుకున్నారు. చేసేది లేక యాజమాన్యం సీఆర్‌ఆర్‌ను టెర్మినేట్ చేసేలా నోటీసులు ఇచ్చింది. టెండర్ నిబంధనలకు విరుద్ధంగా అధిక డీజిల్ వినియోగంపై సీఆర్‌ఆర్‌కు రూ.57 కోట్లు, జీవీఆర్‌కు రూ.27 కోట్లు మొత్తంగా రూ.84 కోట్లు సింగరేణి యాజమాన్యం జరిమానా విధించింది. పనుల నిలిపివేతకు ఈ జరిమానాలు కూడా ఒక కారణమని తెలుస్తోంది.
రోజుకు 12 వేల టన్నుల నష్టం..
ఓబీ సంస్థల నిర్వాహకంతో ఓసీపీలో రోజుకు 12 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం జరుగుతోంది. రోజుకు రూ.కోటి వరకు నష్టపోతోంది. టెండర్ సమయంలో అధికారులు ఓబీ సంస్థల సామర్థ్యాన్ని అంచనా వేయకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కాగా, ఓబీ సంస్థలు చేతులెత్తేయడంతో సింగరేణి సొంతంగా ఓబీ పనులు చేపడుతోంది. సంస్థ ఉద్యోగులతో 3 షావల్స్‌తో ఓబీ వెలికి తీస్తున్నా.. రోజుకు కనీసం 5 వేల క్యూబిక్ మీటర్లు కూడా తీయలేకపోతోంది. మరోవైపు కాంట్రాక్టర్‌తో ఓబీ తీస్తే క్యూబిక్ మీటర్‌కు రూ.135 ఖర్చయితే నేడు కంపెనీ ఇందుకు రూ.400 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఓసీపీలో ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 1 వరకు 16.09 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా 14.58 లక్షల టన్నులు మాత్రమే వెలికితీశారు. 83 శాతం లక్ష్యం సాధించారు. సమస్య పరిష్కరించి ఓబీ, బొగ్గు ఉత్పత్తి పెంచకుంటే సంస్థ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.
కొత్త టెండర్లు పిలిచాం..
జీవీఆర్ సంస్థ స్థానంలో మరో సంస్థ కోసం కొత్త టెండర్ పిలిచాం. రెండు మూడు నెలల్లో పనులు మొదలవుతాయి. ఇక సీఆర్‌ఆర్ సమస్య పరిష్కరించి, దానికి కూడా టెండర్ పిలుస్తాం. ఈ విషయమై ఉన్నతాధికారులతో చర్చిస్తున్నాం. రెండు టెండర్లు పూర్తయితే పనులు పుంజుకుంటాయి. అప్పటి వరకు కంపెనీ ఆధ్వర్యంలో ఓబీ వెలికితీస్తూ వీలైనంత బొగ్గు ఉత్పత్తి చేస్తాం. – చిప్ప వెంకటేశ్వర్లు,
ప్రాజెక్టు అధికారి, ఎస్సార్పీ ఓసీపీ
నిత్యం ఆందోళనలు
సీఆర్‌ఆర్ కాంట్రాక్టు సంస్థ నాలుగు నెలలుగా వేతన బకాయిలు రూ.4 కోట్లు చెల్లించకపోవడంతో కార్మికులు నిత్యం ఆందోళనలు చేస్తున్నారు. వాహనాల నిలిపివేత, ఆత్మహత్యాయత్నాలు, అధికారుల ఘెరావ్‌లతో గని ఉద్రిక్తంగా మారింది. వేతనాలు చెల్లించకుంటే గనిని పూర్తిగా మూసి వేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల పహారాలో ఓసీపీ నడుస్తోంది. వేతనాలు చెల్లించకుంటే మరో రెండు రోజుల్లో అధికారుల కార్యాలయాలకు తాళం వేస్తామని కార్మికులు అల్టిమేటం ఇచ్చారు.