ఉపాధ్యాయుల లెర్నింగ్‌ టూర్‌! | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల లెర్నింగ్‌ టూర్‌!

Oct 13 2025 8:24 AM | Updated on Oct 13 2025 8:24 AM

ఉపాధ్

ఉపాధ్యాయుల లెర్నింగ్‌ టూర్‌!

వినూత్న విద్యాబోధనపై అధ్యయనం

5 రోజులు పలు దేశాల్లో పర్యటన

జిల్లాకు ముగ్గురు చొప్పున ఎంపిక..

ఉమ్మడి జిల్లా నుంచి 12 మందికి ఛాన్స్‌..

నిర్మల్‌ఖిల్లా: రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు డాక్టర్‌ ఈ.నవీన్‌ నికోలస్‌ ఉపాధ్యాయుల విదేశీ టూర్‌కు సంబంధించిన మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు రెండురోజుల క్రితం జారీ చేశారు. నవంబర్‌లో ఒక్కో బృందానికి 40 మంది చొప్పున నాలుగు బృందాల్లో 160 మంది ఐదు రోజులపాటు సింగపూర్‌, వియత్నాం, జపాన్‌, ఫిన్లాండ్‌ దేశాల్లో పర్యటించనున్నారు. అక్కడి పాఠశాలల బోధన విధానం, విద్యార్థి–ఉపాధ్యాయ సంబంధాలు, సాంకేతిక వినియోగం వంటి అంశాలను అధ్యయనం చేసి తిరిగి వచ్చాక రాష్ట్రంలో అమలు చేసేలా మార్గదర్శకాలు రూపొందించనున్నారు.

ఉమ్మడి జిల్లా నుంచి 12 మంది...

ఉమ్మడి జిల్లాలో నిర్మల్‌, ఆదిలాబాద్‌, కుమురంభీం, మంచిర్యాల నుంచి ముగ్గురు చొప్పున మొత్తం 12 మంది విదేశీ పర్యటనలో భాగం కానున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో దాదాపు 2,855 ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ పాఠశాలలు ఉండగా దాదాపు 12 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఎంపికై న ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయి బృందంలో ఆయా దేశాల్లో పర్యటించి అక్కడి బోధన విధానాలను అధ్యయనం చేయనున్నారు.

ఎంపిక ప్రక్రియ ఇలా..

బోధన రంగంలో కనీసం పదేళ్ల అనుభవం, 55 ఏళ్ల లోపు వయస్సు, పాస్‌పోర్టు కలిగి ఉన్నవారు ఈ పర్యటనకు అర్హులు. కలెక్టర్‌ చైర్మన్‌గా అదనపు కలెక్టర్‌, డీఈవో, జిల్లాస్థాయి సీనియర్‌ అధికారులు సభ్యులుగా ఉన్న కమిటీ జిల్లాకు ముగ్గురు చొప్పున ఉత్తమ టీచర్ల పేర్లను ఎంపిక చేయనుంది. ఇందుకుగానూ మూడేళ్లలో వారి పనితీరు పరిశీలిస్తారు. ‘పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలను పెంచడంలో తీసుకున్న చొరవ, విద్యార్థుల సంఖ్య పెంచడం, వృత్తిపరంగా అభివృద్ధి, పాఠశాల అభివృద్ధికి తీసుకున్న చర్యలు, వినూత్న బోధనా పద్ధతులు, సాధించిన పురస్కారాలు, ఆంగ్లంలో సంభాషించే సామర్థ్యం’ అనే ఏడు కొలమానాల ఆధారంగా జిల్లా కమిటీ టూర్‌కు వెళ్లే ఉపాధ్యాయులను ఎంపిక చేస్తుంది. ఈ ఎంపిక ప్రక్రియ ఈనెల 23 లోపు పూర్తి చేస్తారు.

తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో అంతర్జాతీయ ప్రమాణాలు ప్రవేశపెట్టేందుకు మరో అడుగు వేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన నాణ్యతను పెంపొందించేలా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులను విదేశాలకు పంపించాలని నిర్ణయించింది. ‘గ్లోబల్‌ లెర్నింగ్‌ టూర్‌’ పేరిట సుమారు 160 మందిని సింగపూర్‌, ఫిన్లాండ్‌, వియత్నాం, జపాన్‌ వంటి దేశాలకు పంపనుంది. వీరు ఆయా దేశాల్లో విద్యా విధానాలను ప్రత్యక్షంగా అధ్యయనం చేయనున్నారు. దీంతో విద్యావ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతుందని విద్యావేత్తలు భావిస్తున్నారు.

ఉపాధ్యాయుల లెర్నింగ్‌ టూర్‌!1
1/1

ఉపాధ్యాయుల లెర్నింగ్‌ టూర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement