
భారమయ్యానా కొడుకా..?
బెల్లంపల్లి: ‘నవ మాసాలు మోసి కని, పెంచి పెద్ద చేసి.. ప్రయోజకుడిని చేశాను కద కొడుకా.. ముసల్దాన్ని.. చేతనైతలేదు.. మీరు కాకుంటే నాకెవరు దిక్కు.. నేనే మీకు భారమయ్యానా’ అంటూ ఓ వృద్ధురాలు కొడుకు ఇంటి ఎదుట బైఠాయించిన ఘటన బెల్లంపల్లి పట్టణంలో జరిగింది. హన్మాన్‌బస్తీకి చెందిన వృద్ధురాలు పొట్ట బాలమల్లమ్మ ఆదివారం తన కొడుకు ఇంటి ఎదుట బైఠాయించి తనకు న్యాయం చేయాలని వేడుకుంది. వృద్ధాప్యంలో తనపై కోపం వద్దని కన్నీరు పెట్టుకుంది.
జీవితమంతా పిల్లల కోసమే..
బాలమల్లమ్మకు నలుగురు కొడుకులు, కూతురు సంతానం. వీరిలో ముగ్గురు కొడుకులు చనిపోయా రు. రెండో కొడుకు రమేశ్ తండ్రి వారసత్వంగా వచ్చిన సింగరేణి ఉద్యోగం చేస్తున్నాడు. కూతురు వసంతకు వివాహం చేసి అత్తారింటికి పంపించారు. అయితే, తల్లి పేరుమీద ఉన్న ఇల్లు కొడుకు రమేశ్ అద్దెకు ఇచ్చి, తల్లిని రేకుల షెడ్‌లో ఉంచాడు. నెలకు రూ.1,500 చెల్లిస్తానని ఇవ్వడం లేదు.
కూతురు వద్ద జీవనం..
కొన్నేళ్ల క్రితం భర్త చనిపోవడం, వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా బాలమల్లమ్మ పరిస్థితి దారుణంగా మారింది. తన పని కూడా తాను చేసుకోలేకపోతోంది. దీంతో కూతురు వసంత తీసుకెళ్లి బాగోగులు చూసుకుంటోంది. ఈ క్రమంలో పెద్దలు పంచాయితీ నిర్వహించారు. పెద్దల సమక్షంలో కొడుకు రమేశ్ ఒప్పందం చేశాడు. కానీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండడంతో ఆదివారం కొడుకు ఇంటి ముందు కూతురు, మనుమరాళ్లతో కలిసి బైఠాయించింది. తనకు న్యాయం చేయాలని కన్నీటిపర్యంతమైంది.
మహిళల మద్దతు..
బాలమల్లమ్మ బాధను చూసి స్థానిక మహిళలు ఆమెకు మద్దతుగా నిలిచారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయవద్దని కోరారు. తల్లిదండ్రులు లేకుంటే మనం ఉండే వాళ్లం కాదని గుర్తించాలని సూచించారు. కొడుకు స్పందించకపోవడంతో చీకటి పడే వరకూ కన్నీరుపెడుతూ అక్కడే ఉండిపోయింది.