
ముంపు బాధితులకు పరిహారం ఇస్తాం
చెన్నూర్: కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాంక్ వాటర్‌తో పంటలు దెబ్బతిన్న రైతులకు పరిహారం అందేలా చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. స్థానిక ఎమ్మె ల్యే క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ కుమార్‌దీపక్, ఆర్డీవో శ్రీనివాస్‌తో కలిసి కోటపల్లి మండలం బబ్బెరచెలుక, దేవులవాడ గ్రామాల రైతులతో ఆదివా రం సమావేశం ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం అనాలోచిత చర్యల కారణంగా కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో పంట పొలాలతోపాటు గృహాలు కోల్పోయారని పేర్కొన్నారు. ముంపు బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్లు కేటాయించి అరులకు అందించే చర్యలు చేపట్టిందన్నారు. భూ సేకరణ నిర్వహించి రైతులకు పరిహా రం ఇస్తామన్నారు. రూ.36 వేల కోట్ల అంచన వ్యయంతో చేపట్టిన ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్‌కు మరో రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తే 55 వేల ఎకరాలకు సాగునీరందేదని తెలిపారు. కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి రైతుల పచ్చని పంట పొలాలను నాశనం చేశారని ఆరోపించారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ డిసెంబర్ 18, 19 తేదీల్లో ముంపు రైతులకు పరిహారం ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. భూ సంబంధిత వివాదాలకు రాజీ అయిన రైతులకు నిబంధనల ప్రకారం చెల్లింపులు జరుగుతాయని తెలిపారు. ముంపు రైతుల కోసం ప్రభుత్వం రూ.5 కోట్లు, పీడీ ఖాతాలో మరో రూ.5 కోట్లు ఉన్నాయని తెలిపారు.