
ఆటల్లోనూ ‘ఆమె’
బెల్లంపల్లి ఏరియాకు చెందిన మహిళా కార్మికులు ఒక వైపు ఉద్యోగం.. మరోవైపు కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే క్రీడల్లో రాణిస్తున్నారు. సింగరేణి గనుల ఏర్పాటులో భూములు కోల్పోయి ప్రత్యేక జీవో ద్వారా సంస్థలో ఉద్యోగాలు సాధించిన ఇద్దరు ఆదివాసీ గిరిజన మహిళలు వెయిట్, పవర్ లిఫ్టింగ్ పోటీల్లో రాణిస్తూ సింగరేణికి గుర్తింపు తెస్తున్నారు. బెల్లంపల్లి ఏరియాకు చెందిన క్రీడాకారులు ఇటీవల జరిగిన కంపెనీ లెవల్ పోటీల్లో బంగారు పతకాలు సాధించి కోలిండియా పోటీలకు ఎంపికయ్యారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ నెల 14 నుంచి జరగనున్న పోటీల్లో పాల్గొననున్నారు.
బరువులు ఎత్తడంలో దిట్ట
గోలేటి సీహెచ్‌పీలో జనరల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సిడాం అనురాధ ఐదేళ్ల క్రితం సింగరేణిలో ఉద్యోగంలో చేరింది. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తూనే వెయిట్, పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తా చాటుతోంది. ఇప్పటి వరకు కంపెనీ లెవల్ పోటీల్లో మూడుసార్లు బంగారు పతకాలు సాధించింది. 2023లో మొదటిసారి కోలిండియా పోటీలకు ఎంపికై నాగ్‌పూర్‌లో జరిగిన పోటీల్లో 57 కిలోల విభాగంలో తొలి ప్రయత్నంలోనే బ్రాంజ్ మెడల్ సాధించింది. ఆ తర్వాత ఒరిస్సాలో జరిగిన కోలిండియా పోటీల్లో పాల్గొంది. ఇటీవల భూపాలపల్లిలో జరిగిన కంపెనీ లెవల్ పోటీల్లో బంగారు పతకం సాధించి కోలిండియా పోటీలకు ఎంపికై ంది.
అథ్లెటిక్స్ టూ వెయిట్ లిఫ్టింగ్
గోలేటి టౌన్‌షిప్‌లోని సింగరేణి డిస్పెన్సరీలో బదిలీ వర్కర్‌గా పనిచేస్తున్న మమత మూడేళ్ల క్రితం సింగరేణిలో ఉద్యోగంలో చేరింది. మొదట్లో అథ్లెటిక్స్‌లో ఏరియా, నియర్‌బై ఏరియాతో పాటు కంపెనీ స్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపింది. 4x100 మీటర్ల పరుగు పందెంలో కోలిండియా పోటీలకు ఎంపికై ంది. ఏరియా అధికారులు వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ వైపు ప్రోత్సహించారు. భూపాలపల్లిలో జరిగిన కంపెనీ స్థాయి పోటీల్లో 47 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించి కోలిండియా పోటీలకు ఎంపికై ంది. అథ్లెటిక్స్‌లో చేజారిన కోలిండియా పతకాన్ని వెయిట్ లిఫ్టింగ్ ద్వారా సాధిస్తానని చెబుతోంది.