
గంజాయి సాగుపై పోలీసుల ఉక్కుపాదం
ఆసిఫాబాద్: గంజాయి సాగుపై కుమురంభీం జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు. గంజాయి సాగు నిర్మూలనే లక్ష్యంగా ఆదివారం డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించారు. అక్రమంగా సాగు చేస్తున్న 86 మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఏఎస్పీ చిత్తరంజన్ కెరమెరి మండలంలో డ్రోన్ సహాయంతో పంట భూములను పరిశీలించారు. అంతాపూర్ గ్రామ పంచాయతీలోని నారాయణగూడ గ్రామానికి చెందిన రాథోడ్ బాలాజీ వ్యవసాయ భూమిలో 51 గంజాయి మొక్కలు గుర్తించారు. అలాగే లింగాపూర్ మండలం గుమ్నూర్(కె) గ్రామంలో ఎస్సై గంగన్న ఆధ్వర్యంలో అడె లక్ష్మణ్ పత్తి పొలంలో సాగు చేస్తున్న 35 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేశారు. గంజాయి సాగు, రవాణా, అమ్మకం, వినియోగం చట్టరీత్యా నేరమన్నారు. అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూన్ నుంచి ఇప్పటి వరకు ఆసిఫాబాద్ సబ్ డివిజన్‌లో 51 కేసులు నమోదు కాగా, 560 మొక్కలు స్వాధీనం చేసుకున్నామన్నారు. డ్రోన్‌తో పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. సమావేశంలో వాంకిడి సీఐ సత్యనారాయణ, కెరమెరి ఎస్సై మధుకర్ పాల్గొన్నారు.