కరెంటు కనెక్షన్ లేదు..!
● ఏళ్లు గడుస్తున్నా స్తంభాలు, తీగలు ఇవ్వని అధికారులు
● తీగల మధ్యలో కర్రలే స్తంభాలు ● బెల్లంపల్లి మండలం మాలగురిజాల శివారులో పంట పొలాల్లో స్తంభాల మధ్య ఎక్కువ దూరం ఉండడం వల్ల తీగలు నేలకు వేలాడుతున్నాయి. మధ్యలో స్తంభాలు ఏర్పాటు చేయాలని గత యాసంగి దిగుబడి సమయంలోనే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. రైతులే తీగల మధ్య కర్రలను స్తంభాలుగా ఏర్పాటు చేసుకున్నారు.
● గతంలో నెన్నెల మండలం గొల్లపల్లికి చెందిన రైతులు విద్యుత్ లైన్ కోసం డీడీలు చెల్లించి నెలల తరబడి ఎదురుచూశారు. ఏఈ డబ్బులు తీసుకున్నా కనెక్షన్ ఇవ్వకపోవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విజిలెన్స్ విచారణ చేపట్టి సస్పెండ్ చేయడం తెలిసిందే.
మంచిర్యాలఅగ్రికల్చర్: వ్యవసాయానికి కరెంటు కనెక్షన్లు ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో రైతులు విద్యుత్ కార్యాలయాలు, అధికా రుల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తోంది. విద్యుత్ తీగలు, స్తంభాల కోసం డీడీలు తీసి ఏళ్లు గడుస్తున్నా మంజూరు చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు, ప్లాట్లకు మాత్రం స్తంభాలు, తీగలు, లైన్‌లాగడం, కనెక్షన్లు మంజూరు చేయడం వెంటనే జరిగిపోతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. కొందరు పొలాల వద్దకు ఉన్న పాత స్తంభాల్లో కొంతదూరం కర్రలసాయంతో మరికొంత దూరం సర్వీసు వైరు లాగి మోటార్లు ఏర్పాటు చేసుకుంటున్నారు.