
ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే భూకబ్జాలు
నస్పూర్: పట్టణ పరిధిలోని ప్రభుత్వ భూములు స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే కబ్జాకు గురవుతున్నాయని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆరోపించారు. శుక్రవారం ఆయన బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి నస్పూర్–శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. నస్పూర్‌లోని విలువైన ప్రభుత్వ స్థలాలను కొందరు వ్యక్తులు కబ్జా చేస్తున్నారని, వాటిని పరిరక్షించాల్సిన రెవెన్యు, పోలీస్ అధికారులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు ప్రతీ గజానికి ఓ ధర నిర్ణయించి మరీ కబ్జాలను ప్రోత్సహిస్తున్నాడని ఆరోపించారు. ఇన్‌కంటాక్స్ కార్యాలయ స్థలం కబ్జాకు కొందరు చదును చేయగా మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా రెవెన్యు అధికారులు స్పందించి ప్రభుత్వ భూమి అని బోర్డు ఏర్పాటు చేశారని తెలిపారు. సదరు భూమిలో బోర్డు తీయించి కబ్జాను ప్రోత్సహించేందుకు ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు రూ.30 లక్షలు డిమాండ్ చేశారనే విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి కేటాయించిన స్థలం కబ్జాకు గురవుతున్నా అదికారులు పట్టనట్లు వ్యవహరించడం శోచనీయమన్నారు. నస్పూర్ శివారులోని 42, 119 సర్వేనంబర్లలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించిన స్థలాలు కబ్జాకు గురి కాకుండా పరిరక్షించాల్సి బాధ్యత కలెక్టర్, రెవెన్యు, పోలీస్ అదికారులపై ఉందన్నారు. కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోకుంటే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ బాకీ కార్డును విడుదల చేశారు. అనంతరం స్థానిక నాయకుల భూ కబ్జాలపై చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్ ఏఓ రాజేశ్వర్‌రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్‌రావు, పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బన్న, టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.సురేందర్‌రెడ్డి, నాయకులు వంగ తిరుపతి, బేర సత్యనారాయణ, మేరుగు పవన్, రాజేంద్రపాణి, బాకం నగేశ్, జనార్ధన్, పానుగంటి సత్తయ్య, గరిశె రామస్వామి, రఫీక్, తదితరులు పాల్గొన్నారు.