
‘గిరి’ చిన్నారులకు మిల్లెట్ ఉప్మ
దండేపల్లి: అంగన్‌వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక పాఠశాలలుగా మార్చి చిన్నారుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం సంస్కరణలు చేపడుతోంది. చిన్నారుల్లో పోషకాహార లోపాలు అధిగమించేందుకు అంగన్‌వాడీ కేంద్రాల్లో కొన్నేళ్లుగా మధ్యాహ్న భోజనం అమలు చేస్తోంది. గిరిజన పిల్లలు ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషకాహారలోపాన్ని అధిగమించేలా మిల్లెట్ ఉప్మను ఉదయం పూట అల్పాహారంగా అందిస్తున్నారు. మిల్లెట్ ఉప్మ మిక్స్‌ను గిరి పోషణలో భాగంగా గిరిజన సహకార సంస్థ ఎంపిక చేసిన అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తోంది. గత కొన్ని నెలలుగా వీటి సరఫరా నిలిచిపోగా మళ్లీ ఇప్పుడు సరఫరా అవుతోందని ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. జిల్లాలో చెన్నూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టు మినహా మంచిర్యాల, బెల్లంపల్లి, లక్సెట్టిపేట ప్రాజెక్టుల పరిధిలో మొత్తంగా 974 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆయా ప్రాజెక్టుల పరిధిలోని తోటి, కొలాం గిరిజన పిల్లలు ఉన్న 18 అంగన్‌వాడీ కేంద్రాల్లో మాత్రమే ప్రస్తుతం మిల్లెట్ ఉప్మను అల్పాహారంగా అందిస్తున్నారు. లక్సెట్టిపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో దండేపల్లి, జన్నారం, లక్సెట్టిపేట మండలాల్లో 203 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటన్నింటిలో మూడేళ్లలోపు చిన్నారులు 3,714, మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 2,865మంది ఉన్నారు. వీరిలో తీవ్ర పోషణ లోపం గలవాళ్లు 212మంది, అతీ తీవ్ర పోషణ లోపం గలవారు 32మంది ఉన్నారు. తీవ్ర, అతి తీవ్ర పోషణ లోపాల నివారణకు బాలామృతం, కోడిగుడ్లు తదితర ఆహార పదార్థాలు అందిస్తున్నారు. లోప పోషణ గలవారికి బాలామృతం ప్లస్ అందజేస్తున్నారు. లక్సెట్టిపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని తోటి, కొలాం గిరిజన పిల్లలు ఉన్న ఏడు అంగన్‌వాడీ కేంద్రాల్లో మిల్లెట్ ఉప్మను అల్పాహారంగా అందిస్తున్నట్లు సీడీపీవో రేష్మ తెలిపారు. జన్నారం మండలం తపాలపూర్, జన్నారం–1, కొత్తపేట, పుట్టిగూడ, దండేపల్లి మండలం లింగాపూర్, ముత్యంపేట, లక్సెట్టిపేట మండలం తిమ్మాపూర్ అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మిల్లెట్ ఉప్మ అందిస్తున్నారు.