
ఆటలో మేటి.. రాజలింగు
● 75 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ పోటీల్లో రాణింపు ● నేటికీ రెండు పూటలా షటిల్ బ్యాడ్మింటన్ సాధన
మందమర్రిరూరల్: కృషి, పట్టుదల ఉంటే వయస్సుతో సంబంధం లేకుండా ఇష్టమైన ఆటలో రాణించొచ్చని నిరూపిస్తున్నారు మందమర్రికి చెందిన షటిల్ బ్యాడ్మింటన్ ఆటగాడు పల్లెం రాజలింగు. సింగరేణి ఉద్యోగంలో ఉన్నప్పుడు 15సార్లు కోలిండియాలో సింగరేణికి పతకాల వర్షం కురిపించిన ఆయన ఉద్యోగ విరమణ పొంది 17 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ 75 ఏళ్ల వయస్సులోనూ జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ప్రస్థానం..
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన పల్లెం రాజలింగు సింగరేణి ఉద్యోగిగా 15సార్లు కోలిండియా స్థాయి పోటీల్లో పాల్గొని ఆరుసార్లు సింగిల్స్, డబుల్స్ విభా గం పోటీల్లో విన్నర్‌గా నిలిచాడు. 2008లో ఉద్యోగ విరమణ చేసిన ఆయన ఆటకు మాత్రం విరమణ ఇవ్వలేదు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. అంతర్జాతీయ పోటీలకు ఎంపిక కావడంతో బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ ప్రత్యేకంగా రాజలింగును అభినందించారు. ఇండియా తరఫున స్వీడన్, పోలాండ్, థాయిలాండ్‌లలో నిర్వహించిన అంతర్జాతీయ పోటీలకు కూడా ఎంపికయ్యాడు. సెప్టెంబర్‌లో ధాయిలాండ్‌లో జరిగిన షటిల్ బ్యాడ్మింటన్ అంతర్జాతీయ స్థాయి (అండర్– 75) సింగిల్స్, డబుల్స్ పోటీల్లో ప్రతిభ కనబర్చాడు. కాగా విశేషంగా రాణిస్తున్న తనకు సింగరేణి యాజమాన్యం కోచ్‌గా అవకాశం ఇవ్వాలని రాజలింగు కోరుతున్నాడు.