
చికిత్స పొందుతూ మహిళ మృతి
నెన్నెల: ఈ నెల 6న మండలంలోని గుండ్లసోమారంలో పెట్రోల్ మీదపడి నిప్పంటుకోవడంతో గాయాలపాలైన జాడి లలిత (40) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. మహిళ భర్త జాడి రాజన్న సోమవారం ఉదయం ఇంట్లో బ్యాటరీ స్ప్రే డబ్బాకు మరమ్మతులు చేస్తుండగా అందులో ఉన్న పెట్రోల్ పొయ్యి వద్ద ఉన్న లలితపై పడడంతో నిప్పంటుకుంది. కాపాడబోయిన రాజన్న కూడా గాయాలపాలయ్యాడు. తీవ్రంగా గాయపడిన లలితను హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. రాజన్న మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతురాలి సోదరుడు దుర్గం రాజారాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.
డీజే నిర్వాహకులపై కేసు
ఆదిలాబాద్‌టౌన్: నిబంధనలకు విరుద్ధంగా డీజేలను ఏర్పాటు చేసి శబ్ధ కాలుష్యంతో ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన నిర్వాహకులపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. టూటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని రిమ్స్ ఎదుట భుక్తాపూర్‌కు చెందిన గాజగూడ శ్రీనిద్, నీలానగర్‌కు చెందిన లఖన్, గోపాల్, తిలక్‌నగర్‌కు చెందిన బక్కి రవీందర్, సతీష్‌తో పాటు మరికొంత మంది డీజేలను నిర్వహించారని తెలిపారు. పోలీసులు చెప్పినప్పటికీ వినిపించుకోకుండా పరిమితికి మించి డీజే సౌండ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నిబంధనలను అతిక్రమించే డీజే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతి లేకుండా డీజేలను ఏర్పాటు చేయవద్దని సూచించారు.
రోడ్డుపై ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన ఒకరిపై కేసు
ఆదిలాబాద్‌టౌన్: మున్సిపాలిటీ అనుమతి లేకుండా రోడ్డుపై ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన నేస్తం ఫౌండేషన్‌కు చెందిన వంశీపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని బస్టాండ్ ఎదుట ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పలు కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని ఇదివరకే సూచించినప్పటికీ కొందరు నిబంధనలను పాటించడం లేదన్నారు. నిబంధనలను అతిక్రమించి ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తుండడంతో ప్రయాణికులు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. అనుమతులు లేకుండా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మున్సిపల్ అనుమతి ఉంటేనే వీటిని ఏర్పాటు చే యాలని సూచించారు. హెచ్చరిక బోర్డులు ఉన్నచో ట ఎలాంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయవద్దన్నారు.
గవాయ్‌పై దాడి హేయమైన చర్య
మంచిర్యాలక్రైం: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై దాడి హేయమైన చర్యగా బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ములకల్ల రాజేంద్రప్రసాద్ అభివర్ణించారు. దాడి ఘటనపై జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బీఎస్పీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాడికి ప్రయత్నించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీ రాష్ట్ర నాయకులు కాదాశి రవీందర్, ఉపాధ్యక్షుడు నాగుల కిరణ్‌బాబు, బెల్లంపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనివాస్, బూడిద మల్లేష్, కృష్ణ చైతన్య, బాంసేపు నాయకులు శంకర్, శెట్టి పాల్గొన్నారు.