
మెరుగైన విద్యుత్ సేవలు అందించాలి
నిర్మల్‌చైన్‌గేట్: ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించాలని టీజీ ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యుత్ శాఖ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో విద్యుత్ వినియోగం వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొత్త విద్యుత్ ఉపకేంద్రాలు, విద్యుత్‌లైన్లు అవసరముంటే ప్రతిపాదనలు పంపాలన్నారు. అటవీ ప్రాంతాల్లో నూతన విద్యుత్ కేంద్రాల నిర్మాణం, విద్యుత్ స్తంభాల ఏర్పాటు తదితర నిర్మాణాల విషయంలో అటవీ అనుమతులు వీలైనంత త్వరగా పొందాలన్నారు. నిర్మాణాలకు సంబంధించి అంచనాలు సిద్ధం చేసి నివేదికలు పంపాలని సూచించారు. స్థల సేకరణ వేగంగా పూర్తి చేసుకోవాలన్నారు. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని, రైతాంగానికి, గృహ వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రజలకు, రైతాంగానికి అనవసర కోతలు లేకుండా, నాణ్యమైన విద్యుత్ అందించాలన్నారు. విద్యుత్ మరమ్మత్తులు, విధులు నిర్వహించే సిబ్బంది తప్పనిసరిగా భద్రతా పరికరాలు ధరించాలన్నారు. సమావేశంలో విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.