
లక్ష్యానికి దూరం..!
హరిత బడి..
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత కార్యక్రమాలు పెంపొందించి విద్యార్థులకు చదువుతోపాటు ఆరోగ్య భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయాల రేటింగ్(ఎస్‌హెచ్‌వీఆర్) పేరిట ప్రత్యేక పురస్కారాలు అందించనుంది. మూత్రశాలల వినియోగం, నీటి వసతి, మొక్కలు నాటి సంరక్షణ తదితర అంశాలు అమలు చేస్తున్న పాఠశాలలకు రేటింగ్ ఇచ్చి పురస్కారాలు అందజేయనున్నారు. ఇప్పటికే ఎస్‌హెచ్‌వీఆర్ కార్యక్రమంపై ఆయా ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. సెప్టెంబర్ ఒకటి నుంచి 30వరకు పాఠశాలల వారీగా ఎస్‌హెచ్‌వీఆర్ యాప్, వెబ్‌సైట్‌లో యూడైస్ కోడ్‌తో లాగిన్ అయి నమోదు చేయాల్సి ఉన్నా ఆసక్తి చూపకపోవడంతో లక్ష్యానికి దూరంగా నిలుస్తోంది. ఈ నెల 5వరకు రాష్ట్రంలో కామారెడ్డి, కొత్తగూడెం జిల్లాలు బడుల రేటింగ్ నమోదు వంద శాతం పూర్తి చేసి ముందు వరుసలో నిలిచాయి. జిల్లాలో 76.27శాతమే పూర్తయింది. మిగతా వాటి నమోదుకు ఈ నెల 15వరకు అంటే మరో వారం రోజులే గడువు వుంది.
రూ.లక్ష వరకు నగదు పురస్కారాలు
అప్‌లోడ్ చేసిన చిత్రాలను కమిటీ బృందం తనిఖీ చేస్తుంది. త్రీ స్టార్ వచ్చిన పాఠశాలలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. ఇందులో భాగంగా జిల్లాలో వివిధ కేటగిరీల ఆరు పాఠశాలలను ఎంపిక చేస్తారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ఫోర్ స్టార్ వచ్చిన వాటిని జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు. దేశంలో అత్యుత్తమంగా ఉన్న 200 పాఠశాలలకు స్వచ్ఛ ఏవమ్ హరిత పురస్కారం అందజేస్తారు. రూ.లక్ష నగదుతోపాటు ఉపాధ్యాయులను విహార యాత్రకు తీసుకెళ్తారు.
దరఖాస్తు గడువు పెంపు
స్వచ్చ ఏవమ్ హరిత స్కూల్ రేటింగ్ కార్యక్రమంపై ఆయా ఉపాధ్యాయులకు అవగాహన కల్పించాం. సెప్టెంబర్ 4నుంచి 30వరకు నమోదు కార్యక్రమం ఉండగా మరోసారి 15వరకు గడువు పెంచారు. గడువు కంటే ముందుగానే అన్ని బడుల రేటింగ్ నమోదు ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు చేపడుతాం. – డీఈవో యాదయ్య
చొరవ చూపితేనే..
జిల్లాలో 1045 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 1,27,834 మంది విద్యార్థులు ఉన్నారు. 2014నుంచి 2020 వరకు పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత, తదితర అంశాల్లో స్వచ్ఛత పురస్కారాలు అందించిన ప్రభుత్వం ఐదేళ్ల తర్వాత తిరిగి స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ రేటింగ్‌తో బడులకు ప్రత్యేక పురస్కారాలు అందించనుంది. పాఠశాలల యాజమాన్యాలు స్కూల్ రేటింగ్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణ, పచ్చదనం, పరిశుభ్రత తదితర పాఠశాల నిర్వహణపై ఆన్‌లైన్‌లో ఫొటోలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 5 వరకు జిల్లాలో 1045 పాఠశాలకు గాను 914 పాఠశాలలు రిజిస్ట్రేషన్ చేసుకోగా 797(76.27శాతం) మాత్రమే వివరాలు, చిత్రాల అప్‌లోడ్ చేశాయి. నీటి సంరక్షణ, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, మొక్కలు, తోటల పెంపకం, సౌరశక్తి వినియోగం తదితర అంశాలకు మార్కులు కేటాయిస్తారు. బడుల రేటింగ్‌కు ప్రధానోపాధ్యాయులు చొరవ తీసుకుని నమోదు చేయాల్సి ఉంది.