
పంటలు వరదపాలు
రైతులను నిండా ముంచిన అధిక వర్షాలు రాలిపోతున్న పత్తికాయలు నెల రోజుల్లో రెండోసారి దెబ్బతిన్న పత్తి, మిర్చి
చెన్నూర్: ఎడతెరిపి లేని వర్షాలు రైతులను నిండా ముంచుతున్నాయి. నెల రోజులుగా కురుస్తున్న అధిక వర్షాలకు పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. గత రెండు నెలల్లో కురిసిన భారీ వర్షాలకు చెన్నూర్, కోటపల్లి, జైపూర్ మండలాల్లో 2,350 ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరో నెల రోజుల్లో పత్తి పంట దిగుబడి చేతికి వచ్చేది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మరోసారి పత్తి, మిర్చి పంటలు నీట మునిగాయి. పత్తి కాయ, పూత రాలిపోతోంది. పత్తి చేన్లు నీట మునగడంతో కాయ మురిగి రాలిపోతున్నాయి. వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతినడంతో పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చేదని ఆందోళన చెందుతున్నారు. గత నాలుగేళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ పంటలను ముంచేస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా బ్యాక్‌వాటర్ చెన్నూర్, జైపూర్, కోటపల్లి మండలాల్లో పంటలు నీటమునిగాయి. గత నెలలో కురిసిన వర్షాలకు 50శాతం పంటలకు నష్టం వాటిల్లగా..అక్టోబర్ మొదటి వారంలో కురిసిన వర్షాలకు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో 20శాతానికి పైగా పంటలు నాశనమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నివేదిక సమర్పించాం..
గత నెలలో వర్షాలకు 2,223 మంది రైతులకు చెందిన 2,350 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. సర్వే చేసి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించాం. గత వారం రోజులగా కుస్తున్న వర్షాలకు పత్తి పంటకు నష్టం జరిగింది. వరద ముంపు చెన్నూర్ డివిజన్‌లో జైపూర్, చెన్నూర్, కోటపల్లి మండలాలకే ఎక్కువగా ఉంటుంది. పోయిన నెలలో దెబ్బతిన్న పంటలే ఈసారి కూడా దెబ్బతిన్నట్లు తెలిసింది.
– బానోత్ ప్రసాద్, ఏడీఏ చెన్నూర్