
ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో డీసీపీ ఏ.భాస్కర్, బెల్లంపల్లి సబ్‌కలెక్టర్ మనోజ్‌తో కలిసి రిటర్నింగ్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 16జెడ్పీటీసీ, 129 ఎంపీటీసీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. మొదటి విడతకు ఈ నెల 9 నుంచి 11వరకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. 12న నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల జాబితా, 13న అప్పీళ్ల స్వీకరణ, 14న పరిష్కారం, 15న ఉపసంహరణ, బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటన, 23న పోలింగ్, నవంబర్ 11న ఓట్ల లెక్కింపు ఉంటాయని వివరించారు. నామినేషన్లు క్షుణ్ణంగా పరిశీలించాలని, పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు.
మహనీయుల ఆశయాలు స్ఫూర్తిదాయకం
మంచిర్యాల అగ్రికల్చర్: మహనీయుల ఆశయాలు మనందరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన మహర్షి వాల్మీకి జయంతి, కుమురంభీం వర్ధంతి వేడుకల్లో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మొహమ్మద్ విలాయత్ అలీ, అధికారులతో కలిసి పాల్గొన్నారు. వాల్మీకి, కుమురంభీం చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు ఎదురు నిలిచి పోరాడిన వీర యోధుడు, ఆదివాసీ ల ముద్దుబిడ్డ కుమురం భీం అని అన్నారు. ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు.