
పైలేరియా నివారణే లక్ష్యంగా ముందుకెళ్లాలి
మంచిర్యాలటౌన్: జిల్లాలో పైలేరియా(బోదకాలు) కేసులు పెరుగుతున్నాయని, నివారణే లక్ష్యంగా వైద్య, ఆరోగ్యశాఖ ముందుకెళ్లాలని కేంద్ర కీటక జనిత వ్యాధుల రీజినల్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో మంగళవారం టాస్ కార్యక్రమంపై శిక్షణ, అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో వైద్యాధికారులు, సూపర్‌వైజర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఆశ, ఆరోగ్య కార్యకర్తలతో 20 బృందాలు ఏర్పాటు చేసి ఈ నెల 13 నుంచి సర్వే నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలో 20 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్కరికి పైలేరియా పరీక్ష చేసి బాధితులకు మందులు అందజేస్తామని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 892 పైలేరియా కేసులు ఉన్నాయని, అందుకే జిల్లాను ఎండమిక్ ఏరియాగా గుర్తించి, టాస్‌ను ఏర్పాటు చేసి, సర్వేను నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ అనిత, డాక్టర్ సునిల్‌కుమార్, జోనల్ మలేరియా అధికారి సైదులు, కీటక జనిత వ్యాధుల రాష్ట్ర కన్సల్టెంట్ నాగయ్య, డాక్టర్ సుధాకర్‌నాయక్, డాక్టర్ ప్రసాద్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, సీహెచ్‌వో వెంకటేశ్వర్లు, డీపీవో ప్రశాంతి, డీపీహెచ్‌ఎన్ నాందేవ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.