నాడు హక్కుల కోసం.. నేడు సౌకర్యాల కోసం | - | Sakshi
Sakshi News home page

నాడు హక్కుల కోసం.. నేడు సౌకర్యాల కోసం

Oct 7 2025 3:29 AM | Updated on Oct 7 2025 3:29 AM

నాడు

నాడు హక్కుల కోసం.. నేడు సౌకర్యాల కోసం

నేడు జోడేఘాట్‌లో కుమురంభీం 85వ వర్ధంతి

గిరిజనులకు తప్పని పోరాటం తాండవిస్తున్న సమస్యలు.. అభివృద్ధికి దూరంగా గూడేలు పోరు గ్రామాలను పట్టించుకోని పాలకులు చాలా పల్లెల్లో బడి, అంగన్‌వాడీ కేంద్రాలు లేవు

కెరమెరి(ఆసిఫాబాద్‌): హట్టి నుంచి జోడేఘాట్‌ వరకు 21 కిలోమీటర్ల పొడవునా ఉన్న ఆప్రాంతం సుందర స్వప్నానికి నిదర్శనం. కుమురంభీం పోరాటం చేసిన 12 గ్రామాల్లో నేటికీ సమస్యలు తాండవిస్తున్నాయి. ఆయా గ్రామాల్లో 322 కుటుంబాలు, 1592 మంది జనాభా నివాసం ఉంటున్నారు. 12 గ్రామాలకు 18 చేతిపంపులు ఉన్నాయి. ఆశ్రమ పాఠశాలలు 2, ప్రాథమిక పాఠశాల 1, అంగన్‌వాడీ కేంద్రాలు 3, పాట్నాపూర్‌లో ఆరోగ్య ఉపకేంద్రం ఉన్నాయి. ఆయా గ్రామాలకు కేవలం 8 ఇందిరమ్మ గృహాలే మంజూరయ్యాయి. సాగునీరు, ప్రభుత్వ గృహాలు, పట్టాపాసు పుస్తకాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, రుణాలు, రోడ్డు సౌకర్యాలులేక ఆయా గ్రామాలు బావురుమంటున్నాయి, మిషన్‌ భగీరథ నీరు సరఫరా అవుతున్నప్పటికీ నాణ్యత లోపించిందని కొన్ని గ్రామాల్లో బావులు, చెలిమెనీరు తాగుతున్నారు.

పోరు గ్రామాల్లో నెలకొన్న సమస్యలు

జోడేఘాట్‌: నాలుగు చేతిపంపుల్లో ఒక్కటే పనిచేస్తోంది. రైతులకు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు రాలేదు. ఎనిమిదేళ్ల క్రితం ఐటీడీఏ అధికారులు సోలార్‌ సిస్టం బిగించినా నిరుపయోగంగానే ఉంది.

జోడేఘాట్‌ కొలాంగూడ: గ్రామంలో ఒకే చేతిపంపు ఉన్నా పనిచేయకపోవడంతో బోరు నీటిపైనే ఆధారపడుతున్నారు. పాఠశాల లేక జోడేఘాట్‌కు వెళ్తున్నారు. అంగన్‌వాడి కేంద్రం లేదు.

టోకెన్‌మోవాడ్‌: గ్రామంలో ఒక్కరికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది.

బాబేఝరి కొలాంగూడ: గ్రామంలో చేతిపంపులు లేక ఇబ్బందిపడుతున్నారు. మిషన్‌ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు కిలోమీటరు దూరంలో ఉన్న బావినీటిని మోసుకురావాల్సిన పరిస్థితి.

బాబేఝరి గోండ్‌గూడ: గ్రామంలో మూడు చేతిపంపులు ఉన్నా వేసవిలో నీరు ఇంకిపోవడంతో గ్రామ సమీపంలో ఉన్న చెలిమె నీటిని తాగుతున్నారు. భారీ వర్షాలు కురిస్తే ఇళ్లలోకి నీరు చేరుతుంది.

బాబేఝరి మహరాజ్‌గూడ: ఒకే చేతిపంపు ఉన్నా అదికూడా పని చేయడంలేదు. దీంతో గ్రామానికి కిలోమీటరు దూరంలో ఉన్న బావినీటిని తాగుతున్నారు.

శివగూడ: గ్రామంలో చేతిపంపు ఉన్నా పనిచేయకపోవడంతో చెలిమెనీరు తాగుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాల లేకపోవడంతో చిన్నారులు బాబేఝరికి వెళ్తున్నారు.

చిన్నపట్నాపూర్‌: విద్యుత్‌ ఉంటేనే బోరు పని చేస్తుంది.

పెద్దపట్నాపూర్‌: పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం లేక చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు.

పాటగూడ: కానుగ మొక్కల విత్తనాలతో విద్యుత్‌ తయారు చేసి అందరి దృష్టిని ఆకర్శించిన గ్రామం. ఒక్కరికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది.

లైన్‌పటార్‌: చేతిపంపు ఉన్నప్పటికీ వేసవిలో రెండు కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు మోసుకురా వాల్సిన పరిస్థితి. టోకెన్‌మోవాడ్‌ నుంచి రోడ్డు సౌకర్యం లేక రాళ్లు రప్పలపై ప్రయాణం చేయాల్సి వస్తోంది.

పిట్టగూడ: పాఠశాల భవనం ఉన్నప్పటికీ ఉపాధ్యాయుడు లేక ఖాళీగా ఉంటోంది.

జల్‌, జంగల్‌, జమీన్‌ నినాదంతో నీరు, అడవి, భూమిపై హక్కులకోసం నిజాం ప్రభుత్వంతో పోరాడిన కుమురంభీం ఆశయాలు నేటికీ నెరవేరలేదు. ప్రభుత్వాలు మారుతున్నా ఆదివాసీ గిరిజనుల జీవితాల్లో మాత్రం మార్పురాలేదు. నాయకుల మాటల్లోనే అభివృద్ధి అనే మాట నానుతుంది కానీ వారి జీవితాల్లో మాత్రం లేదన్నది నగ్నసత్యం. గూడేలు, తండాల్లో మౌలిక సదుపాయాల కోసం పోరాడాల్సిన పరిస్థితి నెలకొంది. నేడు కుమురం భీం 85వ వర్ధంతి సందర్భంగా కథనం.

పోరాటయోధుడు భీం

ఆసిఫాబాద్‌: ఆదివాసీల ఆరాధ్యదైవం కుమురంభీం ఆసిఫాబాద్‌ మండలం రౌటసంకెపెల్లిలో కుమ్రం చిన్ను, సోంబాయి దంపతులకు 1901లో జన్మించారు. నిజాం నవాబు సాగించిన దోపిడీ, దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ వీరోచితంగా పోరాడాడు. జల్‌, జంగల్‌, జమీన్‌ నినాదంతో నిజాం ప్రభుత్వంపై పోరు కొనసాగించాడు. మేకల కోసం చెట్టుకొమ్మను కొట్టిన తన స్నేహితుడు పైకు చేతి వేళ్లను జంగ్లాత్‌ సేరేదార్‌ నరికించడాన్ని కళ్లారా చూసిన భీం కన్నీరు కార్చాడు. ఆదివాసీ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం లాంటి ఘటనలు ఆయనను తీవ్రంగా కలచివేశాయి. ఈ క్రమంలో తండ్రి చిన్ను విషజ్వరంతో మృతి చెందడంతో సోదరులు సోము, బొజ్జుతో పాటు చిన్నాయనలతో కలిసి సంకెపెల్లి వీడి కెరమెరి మండలంలోని సుర్దాపూర్‌ గూడేనికి చేరుకున్నాడు. అక్కడ ఆదివాసీలు అడవిని నరికి సేద్యం చేయగా పంట చేతికొచ్చే సమయానికి సిద్దిక్‌ అనే ముస్లిం జాగిర్దార్‌ వచ్చి సుర్దాపూర్‌ భూముల తమవేనని హుంకరించాడు. అతనిపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో భీం అక్కడి నుండి పారిపోయి బల్లార్షా మీదుగా మహారాష్ట్రలోని చాందా చేరుకున్నాడు. అక్కడ వినోభా అనే ఉద్యమకారుడు ఆశ్రయం ఇవ్వగా అక్కడ కొంతకాలం పనిచేసి అస్సాం వెళ్లిపోయాడు. అక్కడ కాఫీ తేయాకు తోటల్లో పనిచేస్తూ ఐదేళ్లపాటు అక్కడే ఉన్నాడు. ఆతర్వాత కెరమెరి మండలంలోని జోడేఘాట్‌ చేరుకున్నాడు.

గెరిల్లా పోరాటం

అస్సాం నుంచి తిరిగొచ్చిన కుమురంభీం జోడేఘాట్‌ కేంద్రంగా నిజాం సర్కార్‌తో గెరిల్లా పోరాటం చేశాడు. అతనికి కుడి భుజంగా సూరు, సహచరుడిగా వెడ్మరాము ఉన్నారు. దట్టమైన అడవుల్లో శత్రువుకూడా అడుగుపెట్టేందుకు సాహసించని కొండకోనల ప్రాంతం జోడేఘాట్‌ కేంద్రంగా ఉద్యమం చేశాడు. వెదురుతో విల్లంబులు, బాణాలు తయారు చేసి, ఉచ్చులు పెట్టడంపై యువకులకు శిక్షణ ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఒక్కో బర్మారా నాటుతుపాకి సమకూర్చాడు. గ్రామాలన్నీ తిరుగుతూ అటవీశాఖ అధికారుల అరాచకాలపై ప్రజలను చైతన్య పరిచాడు. నాగలి, పొరక, మేకులు, కంచెలపై నిజాం ప్రభుత్వం విధించే పన్నులు కట్టవద్దని నిజాం ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించా డు. ఈ క్రమంలో అప్పుల పేరుతో పంటలను దోచుకునేందుకు వచ్చే వ్యాపారులు, పన్ను వసూళ్లకు వచ్చే రెవెన్యూ అధికారులపై భీం, అతని అనుచరులు దాడులు కొనసాగించారు. దీంతో బాబేఝరి కేంద్రంగా 12 పోరుగ్రామాలకు వెళ్లేందుకు పోలీసుల వెన్నులో వణుకు పుట్టిందంటే అతిశయోక్తికాదు. బాబేఝరి కేంద్రంగా గిరిజనులు అడవిని నరికి 12 గ్రామాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నిజాం సర్కారు వారిపై కేసులు పెట్టింది. వాటి నుంచి విముక్తి కోసం నిజాం నవాబును కలిసేందుకు హైదరాబాద్‌ వెళ్లిన భీంకు నవాబు దర్శనం లభించక అవమానభారంతో తిరుగుముఖం పట్టాడు. అతను వచ్చేసరికి జంగ్లాత్‌ వాళ్లు 12 గ్రామాలను తగులబెట్టరు. దీంతో కలత చెందిన భీమ్‌ అటవీశాఖ అధికారులపై తిరగబడి తరిమికొట్టాడు. జల్‌.. జంగల్‌.. జమీన్‌ సాధించాలంటే ఇంటికో పోరాట యోధుడు కావాలని పిలుపునిచ్చాడు. గిరిజన యువకులందరినీ చేరదీసి సాయుధ దళం ఏర్పాటు చేశాడు.

అనుచరుడి వెన్నుపోటు

చివరి ప్రయత్నంగా నిజాం ప్రభుత్వం చర్చలకు సబ్‌కలెక్టర్‌ను జోడేఘాట్‌ పంపింది. 12 గ్రామాలకు పట్టాలిస్తామని, అప్పులన్నీ మాఫీ చేస్తామని సబ్‌ కలెక్టర్‌ ప్రతిపాదించాడు. కానీ భీం 12 పోరుగ్రామాల మీద రాజ్యాధికారం కావాలని డిమాండ్‌ చేయడంతో చర్చలు విఫలమయ్యాయి. విషయం నిజాం నవాబుకు తెలియడంతో ఆగ్రహానికి గురై భీంను అంతమొందించాలని ఆదేశించాడు. ఈ క్రమంలో 1940లో దాదాపు ఏడు మాసాల పాటు భీం అనుచరులు, నిజాం సేనల మధ్య యుద్ధం జరిగింది. అనుచరులు ఒక్కొక్కరు నేలకొరిగినా భీం వెన్ను చూపలేదు. దట్టమైన అడవిలో అతని ఆచూకీ కనుగొనడం ఎవరితరం కాలేదు. ఎట్టకేలకు భీం అనుచరుడు మడావి కొద్దు ఇచ్చిన సమాచారం మేరకు అక్టోబర్‌ 10న అశ్వియుజ పౌర్ణమి రోజున ఐదు గంటల పాటు సాగిన భీకర పోరులో భీం నేలకొరిగాడు. నాలుగు దశాబ్దాలుగా ఏటా జోడేఘాట్‌లో భీం వర్ధంతి నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివాసీ, గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ఐటీడీఏ ఆధ్వర్యంలో దర్బార్‌ ఏర్పాటు చేస్తున్నారు. మంగళవారం జోడేఘాట్‌లో అధికారికంగా కుమురంభీం 85వ వర్ధంతి కార్యక్రమం ఆదివాసీ సంప్రదాయం ప్రకారం నిర్వహించేందుకు ఐటీడీఏ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.

నాడు హక్కుల కోసం.. నేడు సౌకర్యాల కోసం 1
1/2

నాడు హక్కుల కోసం.. నేడు సౌకర్యాల కోసం

నాడు హక్కుల కోసం.. నేడు సౌకర్యాల కోసం 2
2/2

నాడు హక్కుల కోసం.. నేడు సౌకర్యాల కోసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement