
గేదెను ఢీకొని యువకుడు మృతి
నర్సాపూర్(జి): మండల కేంద్రంలోని 61వ జాతీయ రహదారిపై గేదెను ఢీకొని యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు... లోకేశ్వరం మండలం హవర్గాకు చెందిన సిందే అరవింద్ పటేల్ (30) సోమవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై నిర్మల్ నుంచి స్వగ్రామానికి వస్తుండగా మార్గమధ్యలో 61వ జాతీయ రహదారిపై అడ్డుగా ఉన్న గేదెను ఢీకొన్నాడు. ఈ ఘటనలో అరవింద్‌కు తీవ్రగాయాలు కావడంతో 108లో నిర్మల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. కాగా హెల్మెట్ ధరించి ఉంటే బతికేవాడేమోనని స్థానికులు చర్చించుకున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు..
తానూరు: మండలంలోని బెల్‌తరోడా చెక్‌పోస్ట్ వద్ద ఆదివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందినట్లు ఎస్సై షేక్ జుబేర్ తెలిపారు. మహారాష్ట్రలోని ఉమ్రి గ్రామానికి చెందిన బోంద్రే సాయినాథ్ (26) తానూరులో ఉన్న బంధువుల ఇంటికి ద్విచక్రవాహనంపై వస్తుండగా బెల్‌తరోడా చెక్‌పోస్ట్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుకనుంచి మరో బైక్‌పై వస్తున్న బంధువులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుని భార్య అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
డీఎస్పీ మృతికి సంతాపం
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని ఫంక్షనల్ వర్టికల్స్ విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న విష్ణుమూర్తి ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సోమవారం సంతాపం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిబద్ధతతో పని చేశారని, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచారని కొనియాడారు.ఆయన మృతి పోలీసు శాఖకు తీరని లోటన్నారు.
యువకుడు ఆత్మహత్య
ఆదిలాబాద్‌టౌన్: యువతి తన ప్రేమను నిరాకరించిందని మనస్తాపానికి గురై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని తిలక్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ చిట్యాల శ్రీకాంత్ (20) కొంతకాలంగా ఓ యువతిని ప్రే మిస్తున్నాడు. విషయాన్ని యువతికి తెలియజేయడంతో నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురై సోమవారం ఇంట్లో ఉరేసుకున్నాడు. అఘాయిత్యానికి పాల్పడే ముందు తన అన్నకు వీడియోకాల్ చేసి ఉరేసుకుంటున్నట్లు తెలిపాడు. అతను స్థానికులకు సమాచారం అందించడంతో కొన ఊపిరితో ఉ న్న శ్రీకాంత్‌ను రిమ్స్ ఆస్పత్రికి తరలించగా అప్పటి కే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతు ని తండ్రి గజానన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ వివరించారు.
నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ట్రాక్టర్
ఆదిలాబాద్‌రూరల్: మండలంలో ఇటీవల ఎడతెరి పి లేకుండా కురుస్తున్న వర్షాలకు సోమవారం అంకాపూర్ గ్రామ శివారులోని వాగు ఉప్పొంగి ప్రవహించడంతో ఓ ట్రాక్టర్ నీటి ప్రవాహంలో ఇరుక్కుపోయింది. దాన్ని బయటకు తీసేందుకు మరో ట్రాక్టర్ ద్వారా ప్రయత్నించగా అది నీటిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

గేదెను ఢీకొని యువకుడు మృతి

గేదెను ఢీకొని యువకుడు మృతి