
చోరీ కేసుల్లో నిందితుల అరెస్టు
కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీకి పాల్పడుతున్న దొంగలను పట్టుకున్నట్లు కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదుద్దీన్ తెలిపారు. సోమవారం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన స్కావెంజర్ గాలోత్ కుషాల్ జూదానికి అలవాటు పడి డబ్బులు సరిపోకపోవడంతో తనవద్ద పనిచేసే ఓర్సు అనిల్‌తో కలిసి దొంగతనాలకు పాల్పడ్డాడు. కుషాల్ ఉదయం సమయంలో స్కావెంజర్‌గా తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తించి రాత్రి అనిల్‌తో కలిసి చోరీకి పాల్పడేవారు. ఈనెల 1న న్యూ కాలనీకి చెందిన ఎస్పీఎం ఉద్యోగి కిషోర్ కుమార్‌లోయ ఇంట్లోకి చొరబడి 213 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదు, ఇదే రోజు ఓల్డ్ కాలనీకి చెందిన ఎస్పీఎం కాంట్రాక్టర్ పిసపాటి హేమచంద్రరావు ఇంట్లో రూ.20వేల నగదు, ఎస్పీఎం ఉద్యోగి భూసాని నరేంద్రవర్మ ఇంట్లో రూ.13 వేల నగదు, గత నెల 29న ఓల్డ్ కాలనీకి చెందిన ఎస్పీఎం ఉద్యోగి సింగాని లక్ష్మణ్ ఇంట్లో రెండు తులాల బంగారు ఆభరణాలతో పాటు తులం వెండి, రూ.10వేల నగదు, మే 9న న్యూ కాలనీకి చెందిన ఎస్పీఎం ఉద్యోగి పొలుసాని భూపాల్ రావు ఇంట్లో రూ.23 వేల నగదు దొంగిలించారు. నిందితులను పట్టుకునేందుకు పట్టణ సీఐ ప్రేంకుమార్, రూరల్ సీఐ కుమారస్వామి ఆధ్వర్యంలో నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. 50 సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించి సోమవారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 18 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కేసును ఛేదించిన పోలీసు సిబ్బంది రాజు, నాగరాజు, సంపత్, నౌషద్, పురుషోత్తంను డీఎస్పీ అభినందించారు. సమావేశంలో సీఐలు ప్రేంకుమార్, కుమారస్వామి, ఎస్సై సుధాకర్ పాల్గొన్నారు.